అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | హైడ్రా (Hydraa) పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం (Gajularamaram)లో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇళ్లు కోల్పోయిన బాధితులను సోమవారం కవిత పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపటొద్దని హైకోర్టు (High Court) ఆదేశించినా.. హైడ్రా పట్టించుకోవడం లేదన్నారు. పేదల ఉసురు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రూ.50 వేల సాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Kavitha | 12 ఎకరాలు కబ్జా చేసిన ఎమ్మెల్యే
గాజులరామారంలోని పోచమ్మ బస్తీలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు వైఎస్ హయాంలో భూములు కేటాయించారన్నారు. ఇక్కడ దాదాపు 400 ఎకరాలు కబ్జా అయ్యాయని ఆమె పేర్కొన్నారు. అప్పుడే కంచె వేసి ఉంటే భూములు కబ్జా అయ్యేవి కావన్నారు. చాలా ప్రభుత్వాలు మారినా భూముల రక్షణను పట్టించుకోలేదని విమర్శించారు. ఇక్కడ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Arikepudi Gandhi) కబ్జా చేసిన 12 ఎకరాల సంగతి ఏంటని కవిత ప్రశ్నించారు.
Kavitha | రాత్రికి రాత్రి కూల్చడం దారుణం
హైడ్రా హడావుడిగా వచ్చి పెద్దల జోలికి వెళ్లకుండా రాత్రికి రాత్రి పేదల ఇళ్లను కూల్చడం దారుణమని కవిత అన్నారు. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఉన్న వాళ్ల ఇళ్లను సైతం కూల్చారని మండిపడ్డారు. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే తానే అడ్డుగా నిలుచుంటానని పేర్కొన్నారు. పేదలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి ఉసురు తగులుతుందన్నారు. ఇక్కడ మొత్తంగా 200లోపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయని, వారికి డబుల్ రూమ్ (Double Bed Room) ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Kavitha | డబ్బులు తిరిగి ఇవ్వాలి
ముఖ్యమంత్రే మున్సిపల్ మంత్రిగా ఉండి గడీలో ఉంటున్నారని కవిత విమర్శించారు. వెంచర్లు చేసి అమ్మటంతో చాలా మంది లక్షలు పెట్టి స్థలాలు కొన్నారన్నారు. వాళ్లకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరాల కొద్దీ పెద్దవాళ్లు చేసిన కబ్జాలు ప్రభుత్వానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. వచ్చే నెల 6వ తేదీ లోపు బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.