అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | హైదరాబాద్(Hyderabad) నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరమంతా జలమయం అయింది. బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, హకీంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు.
Heavy Rains | ఆ రూట్స్ క్లోజ్..
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC), హైడ్రా సిబ్బంది(Hydra Staff), ట్రాఫిక్ పోలీసులు వరద నీటిని తొలగించేందుకు యత్నిస్తున్నారు.ఇదిలా ఉండగా, మూసీ నదిలో వరద ప్రవాహం తీవ్రంగా పెరిగింది. మూసారాంబాగ్ వంతెన వద్ద నీటి మట్టం ప్రమాదకరంగా ఉండటంతో, అధికారులు వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాహనదారులు గోల్నాకా వంతెన మార్గాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలంటూ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) సూచించారు. అలాగే, హిమాయత్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17 వద్ద సర్వీస్ రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తోంది. దీనివల్ల ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్నాయని, వాటిని పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరుతున్నారు.
వాతావరణ శాఖ(Meteorological Department) తాజా ప్రకారం, మంగళవారం (ఆగస్టు 12) రోజున హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.