అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar Results | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (National Democratic Alliance) (ఎన్డీయే) సంచలన విజయం సాధించింది. 243 నియోజకవర్గాల్లో ఏకంగా 200లకు పైగా స్థానాల్లో ఆధిపత్యం చాటుకుంది.
మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) అఖండ విజయం దిశగా దూసుకుపోవడానికి ఐదు అంశాలు కీలకంగా మారాయి.. వ్యూహాత్మక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభావవంతమైన ప్రచార సందేశాలతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా ఐదోసారి ఘన విజయం నమోదు చేశారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని అంచనా వేసినప్పటికీ, ఈ స్థాయిలో సీట్లను సాధించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. తాజా ఎన్నికల్లో ఎన్డీయేను “సూపర్” కూటమిగా మార్చడంలో ఐదు కీలక అంశాలు పని చేశాయి.
Bihar Results | ‘టైగర్ జిందా హై’
దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ కు నాయకత్వం వహించిన నితీశ్ కుమార్కు (Nitish Kumar) అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ దృక్పథం, ప్రజా విశ్వాసానికి కీలకమైన పరీక్షగా మారాయి. ఒకప్పుడు అరాచకాలకు కేంద్ర బిందువుగా, ఆటవిక పాలనకు అడ్రస్ గా మారిన బీహార్ ను అభివృద్ధి బాట పట్టించిన నితీశ్ “సుశాసన్ బాబు”గా ప్రశంసలందుకున్నారు. అయితే, ఆయన తరచూ కప్పగంతులు వేస్తూ కూటములను మార్చుతూ ప్రజల్లో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు.
అలాగే, ఆయన ఆరోగ్యంపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి.. అయితే, నితీవ్ తన ప్రధాన బలమైన ఈబీసీ + కుర్మీలు + మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో మరోమారు విజయవంతమయ్యారు. “పాల్టు రామ్” అని ప్రతిపక్షాలు ఎగతాళి చేసినప్పటికీ, జంగిల్ రాజ్ (Jungle Raj) తర్వాత అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమ్మిళిత పాలనలో నితీశ్ ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని పొందారు.
ఇదే నితీశ్ కు చివరి ఎన్నిక కావచ్చు అనే ఊహాగానాలు, అతనిని ముఖ్యమంత్రిగా మారుస్తారనే పుకార్లు కూడా ఆయనపై సానుభూతి వెల్లువెత్తింది. ఒకప్పుడు అతని పనితీరును మెచ్చిన ఓటర్లు ఇప్పుడు తనను అనుభవజ్ఞుడైన, స్థిరమైన పాలకుడిగా భావించి గెలిపించారు. ఎన్డీయే భారీ విజయం నేపథ్యంలో పాట్నాలో నితీశ్ పోస్టర్లు భారీగా వెలిశాయి. “హుమారే బీహార్ మే ఏక్ స్టార్, హర్ బార్ నితీశ్ కుమార్,” “బీహార్ కా మత్లాబ్ నితీష్ కుమార్” వంటి నినాదాలు, “టైగర్ అభి జిందా హై” (Tiger Abhi Zinda Hai) అన్న హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
Bihar Results | ఎన్డీయే సర్కారు వైపే మహిళల మొగ్గు
బీహార్ లో ఎన్డీయే సునామీకి ప్రధాన కారణం మహిళలు. మహిళా ఓటర్లు ఈసారి ఎన్డీయే వైపు మొగ్గు చూపారు. ఎన్నికలకు ముందు ఎన్డీయే సర్కారు (NDA government) ప్రతి మహిళ ఖాతాలో రూ.10 వేల చొప్పున జమ చేసింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన (Mahila Rozgar Yojana) దాదాపు 1.5 కోట్లకు పైగా మహిళల ఖాతాల్లో ఈ మొత్తం జమ కావడం తీవ్రంగా ప్రభావం చూపింది. అందుకే ఓటింగ్ రోజు అతివలే భారీగా తరలి వచ్చారు.
పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేశారు. పురుషులలో కేవలం 62.98 శాతంతో పోలిస్తే మహిళలు 71.78 శాతం ఓటు వేశారు. 2005లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నితీశ్ మహిళా అనుకూల చర్యలు తీసుకోవడం ద్వారా వారిని ఆకట్టుకున్నారు. పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలలో మహిళలకు 50% సీట్లు రిజర్వేషన్ చేయడం, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు, బాలికలకు ఉచిత స్కూల్ యూనిఫాంలు, సైకిళ్ళ పంపిణీ వంటివి చేపట్టారు. నితీష్ మహిళా అనుకూల నిర్ణయాలు ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించాయి.
Bihar Results | చిరాగ్ పాస్వాన్..
ఎన్డీయే సంచలన విజయంలో లోక్ జనశక్తి పార్టీ (Lok Janshakti Party) (రామ్ విలాస్) కూడా కీలకంగా మారింది. ఒకప్పుడు 2 శాతమే విజయం సాధించిన ఆ పార్టీ స్ట్రైక్ రేట్ ఈసారి 75 శాతం దాటిపోయింది. పోటీ చేసిన 29 సీట్లలో 23 సీట్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన తర్వాత చిరాగ్ పాస్వాన్ (Chirag Paswan) ఎన్డీయే కూటమిలోకి తిరిగి రావడం కీలకంగా మారింది.
2024 లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేసిన ఐదు స్థానాలను కైవసం చేసుకున్న తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో కూడా పాస్వాన్ అదే ఊపును కొనసాగించాడు. ప్రధానంగా దళిత ఓటర్లను సాధించడంలో పాస్వాన్ కీలకంగా మారారు. అలాగే దివంగత తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని ఉద్ఘాటిస్తూ భావోద్వేగ ప్రసంగాలతో ఆయన ప్రచార శైలి కొనసాగింది. సోషల్ ఇంజినీరింగ్ ను బలోపేతం చేయడం ద్వారా చిరాగ్ మరోసారి చారిత్రక విజయాన్ని చేజిక్కించుకున్నారు.
Bihar Results | ‘ఆటవిక రాజ్యం’ తిరిగి వస్తుందనే భయం..
ఆర్జేడీ పాలన వస్తే ఆటవిక రాజ్యం మళ్లీ వస్తుందని ఎన్డీయే చేసిన ప్రచారం ఓటర్లను తీవ్ర ప్రభావితం చేసింది. ప్రధాని మోదీ (Prime Minister Modi) ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ‘కట్టా, దునాలి, రంగదారి’ (తుపాకులు, దోపిడీ, అక్రమాల) గురించి ప్రస్తావించారు. ఆర్జేడీ తిరిగి అధికారంలోకి వస్తే ‘జంగిల్ రాజ్’ తిరిగి వస్తుందని హెచ్చరించారు. ఇది గత ఆర్జేడీ పాలనలో (RJD regime) జరిగిన అవినీతి, దోపిడీ, అక్రమాలు ఓటర్లకు గుర్తు తెచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి పాలనతో ముడిపడి ఉన్న ‘ఆటవిక’ రోజులు తిరిగి రాకుండా ఉండాలనే లక్ష్యంతో మహిళా ఓటర్లలో అత్యధికం ఎన్డీయేకు ఓటేశారని పరిశీలకులు చెబుతున్నారు.
Bihar Results | సంక్షేమ పథకాలు..
ఎన్నికలకు ముందు నితీశ్ ప్రభుత్వం (Nitish government) ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలు మరోసారి అధికారాన్ని కట్టబెట్టాయి. 1.2 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్య పెన్షన్ను రూ. 400 నుండి రూ. 1,100 కు పెంచాలనే ప్రభుత్వం నిర్ణయం పాలక ఎన్డీఏ ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. మరోవైపు, మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున వేయడం బాగా ప్రభావితం చేసింది. తాము గెలిస్తే నెలకు రూ.2,500 పెన్షన్ ఇస్తానని తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీని అంగీకరించడం కంటే, నితీష్ కుమార్ ఇచ్చిన హామీని నమ్మడానికి మహిళలు ఇష్టపడ్డారు. సంక్షేమ పంపిణీ, వ్యూహాత్మక పొత్తులు, ప్రభావవంతమైన సందేశం, నితీష్ కుమార్ రాజకీయ స్థితిస్థాపకత కలయిక ఇటీవలి బీహార్ చరిత్రలో అత్యంత నమ్మకమైన ఎన్నికల విజయాలలో ఒకటిగా కనిపిస్తుంది.
