అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగానికి లోబడే పని చేస్తోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్వరలో బీహార్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) కొద్ది రోజుల ముందు.. ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) గురువారం విచారించింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం చర్యను సమర్థించిన న్యాయస్థానం.. రాజ్యాంగం ఆదేశానికి అనుగుణంగానే ఈసీ చర్యలు ఉన్నాయని అభిప్రాయపడింది. బీహార్(Bihar)లో 2003లో ఇటువంటి సవరణలు నిర్వహించారని గుర్తు చేసింది.
Supreme Court | అభ్యంతరం తెలిపిన పిటిషనర్లు..
ఎన్నికలు నెలల దూరంలో ఉన్న తరుణంలో.. మొత్తం ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR)ను 30 రోజుల్లో కొనసాగిస్తామని ఎన్నికల సంఘం చెబుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఆధార్‌ను పరిగణించట్లేదని, తల్లిదండ్రుల పత్రాలు కూడా అడుగుతున్నానరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఏకపక్షంతో పాటు వివక్షత చూపించడేమనని వాదించారు.
ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్(Special Intensive) సవరణను ఇంత ఆలస్యంగా ఎందుకు ప్రారంభించారని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఈ ప్రక్రియ తప్పు కానప్పటికీ, ఎన్నికలకు కొన్ని నెలల ముందు చేసి ఉండాల్సిందని పేర్కొంది. 2025 ఓటరు జాబితాలో ఇప్పటికే ఉన్న వ్యక్తిని ఓటు హక్కును రద్దు చేయాలనే మీ (ఈసీ) నిర్ణయంపై సదరు వ్యక్తి అప్పీల్ చేయవలసి వస్తుందని, కానీ అప్పటికే ఎన్నికల సమయం మించిపోతే అతడు ఓటు వేసే హక్కు కోల్పోతాడని సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court | నిబంధనల ప్రకారమే..
వివక్ష చూపుతున్నారన్న పిటిషనర్ల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల సంఘం నడుచుకుంటోందని స్పష్టం చేశారు. “వారు (ఈసీ) రాజ్యాంగంలో పేర్కొన్నది చేస్తున్నారు. అది సరియైనదా.. కాదా? అని మీరు (పిటిషనర్లు) చెప్పలేరు? ఇందులో ఒక సానుకూలత ఉంది. కంప్యూటరీకరణ తర్వాత ఇది మొదటిసారి కాబట్టి వారు తేదీని నిర్ణయించారు. కాబట్టి అందులో లాజిక్ ఉంది. అది లేదని మీరు చెప్పలేరు” అని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా(Sudhanshu Dhulia), జోయ్‌మల్య బాగ్చి(Joymalya Bagchi)లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పౌరులు కాని వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండకుండా చూసుకోవడానికి ఇంటెన్సివ్ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాను శుభ్రపరచడంలో తప్పు లేదు. కానీ ప్రతిపాదిత ఎన్నికలకు కొన్ని నెలల ముందు మీరు ఈ నిర్ణయం తీసుకుంటే.. ఎలా అని ఈసీని ప్రశ్నించింది.