అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari Water | గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టును (Polavaram-Nallamala Sagar project) అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది.
ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సింఘ్వీని కలిశారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, సాక్ష్యాలను సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు.
Godavari Water | రిట్ పిటిషన్
అనుమతులు పొందకుండా పోలవరాన్ని బనకచర్ల, నల్లమల సాగర్‌తో అనుసంధానించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రాజెక్టును వాస్తవంగా ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మించాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధంగా అనుమతించదగినది కాదని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడాన్ని కూడా వ్యతిరేకించింది.
కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) డీపీఆర్ తయారీతో ముందుకు వెళ్తోందని పేర్కొంది. ఈ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది.