Homeజిల్లాలునిజామాబాద్​Bhubarathi | భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్​

Bhubarathi | భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్​

భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో ఉంచవద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లి తహశీల్దార్​ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bhubarathi | భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. ఎడపల్లి (Yedapally) తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​తో కలిసి సందర్శించారు. తహశీల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) సన్నాహక అమలుపై సమీక్ష నిర్వహించారు.

భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్​లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు.. ఎన్ని నోటీసులు ఇచ్చారనే విషయంపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు.. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

Bhubarathi | దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలి

భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్​ సూచించారు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ దత్తాద్రి ఉన్నారు.

Bhubarathi | సోయాబీన్ కొనుగోలు కేంద్రం తనిఖీ

బోధన్ (Bodhan) మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని (Soybean) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించిన కలెక్టర్, ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల సోయాబీన్ సేకరణ జరిపారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద యంత్రం సాయంతో పంటను శుభ్రం చేస్తున్న తీరును గమనించి, అధికారులకు సూచనలు చేశారు.

రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులు తేమ 12 శాతానికి లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను జాగ్రత్తగా సీడబ్ల్యూసీ గోడౌన్లకు తరలించాలన్నారు. రైతులకు నిర్దిష్ట గడువులోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అయితే మొక్కజొన్న, సోయాబీన్ సేకరణకు సంబంధించి పట్టా రైతు బయోమెట్రిక్ వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను అమలు చేస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు కౌలు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సడలింపు ఇవ్వాల్సిందిగా రైతులపక్షాన మరోమారు కోరతామన్నారు. కలెక్టర్ వెంట మార్క్​ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్, వ్యవసాయ అధికారి సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు.

Must Read
Related News