అక్షరటుడే, ఇందల్వాయి : Telangana University | మేధో సంపత్తి హక్కులపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఐపీఆర్ సెల్ (IPR Cell) ఆధ్వర్యంలో ‘మేధోసంపత్తి హక్కులు (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ – IPR)’ అంశంపై వర్సిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) విజ్ఞాన సాంకేతిక విభాగం (TG-COST), డీఎస్టీ–భారత ప్రభుత్వం, పర్యావరణ, అరణ్య,విజ్ఞాన సాంకేతిక శాఖ ఆర్థిక సహకారం అందించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. పరిశోధకులు, విద్యార్థులు తమ ఆవిష్కరణలను రక్షించుకోవడానికి మేధోసంపత్తి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Telangana University | ఐపీఆర్పై అవగాహన
శాస్త్రవేత్త డాక్టర్ గుర్రపు రాజు (Scientist Dr. Gurrapu Raju) మాట్లాడుతూ.. పేటెంట్లు, కాపీరైట్స్, ట్రేడ్మార్క్స్ వంటి ఐపీఆర్ అంశాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా కె. ప్రసన్న రాణి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ఐపీఆర్ అవగాహన పెంపొందించడం ద్వారా పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో సృష్టికర్త హక్కులను గుర్తించడం భారతీయ సంస్కృతిలో కూడా ఉన్నవేనన్నారు.
Telangana University | హక్కులపై మార్గనిర్దేశం
ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఐపీఆర్ సెల్ నోడల్ ఆఫీసర్ వాసం చంద్రశేఖర్ (Vasam Chandrasekhar) మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో పరిశోధకులు, అధ్యాపకులు విద్యార్థులకు పేటెంట్ దాఖలు, మేధోసంపత్తి హక్కులపై నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.