అక్షరటుడే, ఇందూరు: MP Arvind | కేసీఆర్ అంత నమ్మకద్రోహి తెలంగాణలోనే లేరని ఎంపీ అర్వింద్ (MP Arvind) విమర్శించారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) భాగంగా సర్పంచ్‌లుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులకు నగర శివారులోని ఓ ఫంక్షన్హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. మొత్తంగా 96 మంది సర్పంచ్‌లు.. పార్లమెంట్ పరిధిలో గెలవడం అద్భుతమన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు.
MP Arvind | చెల్లెలే కుటుంబ పరువు తీస్తోంది..
కేటీఆర్ నుంచి ఆయన బావ హరీష్‌రావు (Harish Rao) గురించి ఆయన చెల్లెలు కవితనే బహిరంగంగా ఆరోపణలు చేస్తుంటే ఇంకా ఏం ముఖం పెట్టుకుని కేటీఆర్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందన్నారు. కూలిపోయే డ్యామ్‌లు కట్టి ఇవాళ పెద్దాయన బయటకు వచ్చి సూక్తులు చెబుతున్నారన్నారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని (KCR Family) జైలుకు పంపాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ప్యాకేజీలకు అమ్ముడుపోవద్దన్నారు.
MP Arvind | ఎమ్మెల్సీ గతి ఏమైంది..?
ప్రజాగ్రహానికి గురైతే ఎలా ఉంటుందో ఈరోజు ఓ ఎమ్మెల్సీని చూస్తే తెలుస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రజలకు ఆగ్రహం కలిగితే ఎంతటి వారైనా రాజకీయంగా భూగర్భంలో కలిసిపోవాల్సిందేనన్నారు. పార్లమెంట్ పరిధిలో గెలిచిన 98 మంది స్వచ్ఛంగా బీజేపీ వ్యక్తులేనన్నారు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. అలాంటి ఊరుకు సేవ చేసుకునే అవకాశం సర్పంచ్‌లకు ఉందన్నారు.
యువతను అభివృద్ధి కార్యక్రమాల్లో కలుపుకుంటూ వెళ్లి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుందని.. ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే గ్రామాలకు నిధులు రాలేదన్నారు. ఇప్పడు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) ఢిల్లీ వెళ్లి నిధులు తెస్తానని చెబుతున్నారని.. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లేందుకు టికెట్లకు డబ్బులు కూడా దండగని.. రావాల్సిన నిధులు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయని అర్వింద్ పేర్కొన్నారు.
MP Arvind | మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు..
గ్రామాలకు సర్పంచ్‌లే ముఖ్యమంత్రులని.. వారికి సర్వాధికారాలు ఉన్నాయని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఏ సీఎంతోనూ అవసరం లేదన్నారు. పారదర్శకంగా అవినీతి లేకుండా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. 12వేల గ్రామ పంచాయతీలుండగా.. వచ్చేసారి 98శాతం పంచాయతీల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
MP Arvind | మాజీ సీఎం కేసీఆర్‌కు చాదస్తం..వైరాగ్యం..
చాన్నాళ్ల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ (KCR) బయటకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టాడని.. అందులో ఆసాంతం చాదస్తం.. వైరాగ్యమే కనిపించిందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణను ఎలా నాశనం చేశారో చెప్తాడని అనుకుంటే పాతా పురాణమంతా చెప్పుకొచ్చాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు తాను కూడా ఒకప్పుడు అభినమానినేన్నారు. ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అన్నారు. ఇరిగేషన్‌పై కూడా చాలా అధ్యయనం చేశారన్నారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత తెలంగాణకు ఆయన నాలెడ్జ్ ఉపయోగపడుతుందనుకుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారన్నారు. కుటుంబానికి రూ.40 నుంచి 50 వేల కోట్లు దోచిపెట్టేందుకు మాత్రమే ఆయన నాలెడ్జ్ పనిచేసిందని దుయ్యబట్టారు.
MP Arvind | ఎలాంటి మద్దతు ఇవ్వకుండానే గెలిచారు: దినేష్ కులాచారి
జిల్లాలో 280మంది బీజేపీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (district president Dinesh Kulachari) పేర్కొన్నారు. అందులో ఎలాంటి మద్దతు లేకుండానే 76 సర్పంచ్‌లు గెలిచారన్నారు. అలాగే జగిత్యాల జిల్లా నుంచి 23మంది సర్పంచ్‌లు విజయం సాధించారన్నారు. ఇంకా 20సీట్లు కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. కార్యకర్తలే బీజేపీకి బలం అని.. సర్పంచ్‌లంతా స్వచ్ఛందంగా నిలబడి గెలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు డబ్బులతో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచారన్నారు. ఏకగ్రీవమైనా తమ వారేనని కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు బీజేపీ విజయాలకు ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లుగా గెలువబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
MP Arvind | గ్రామాభివృద్ధికి కృషి చేయాలి:పల్లె గంగారెడ్డి
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని ఆదర్శమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. బీజేపీ మద్దతుతో పోటీచేసి ఓడిపోయిన వారు ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కావద్దని.. ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సర్పంచ్‌లుగా గెలిచిన వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా బీజేపీ ఎమ్మెల్యేలు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరిబాబు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.