అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాళేశ్వరం (Kaleshwaram) జలస్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సజీవ జల దృశ్యాన్ని అదృశ్యం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని.. లక్షల కోట్ల అవినీతి జరిగిందని నిందలు వేసి, కేసీఆర్‌పై సీబీఐ విచారణ కోరడం రాష్ట్ర ఆత్మగౌరవానికే తలవంపు అని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టించిన అపోహలను అనేక వేదికల ద్వారా తొలగించినా అదేపనిగా విషం కక్కుతున్నారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ (Ghosh Commission) ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని చందంగా ఉందని ఎద్దేవా చేశారు. తాజాగా సీబీఐ విచారణ అంటూ సరికొత్త మోసానికి తెరదీశారని ఆయన ఎద్దేవా చేశారు. ఎడారిగా మారిన తెలంగాణ (Telangana) భూములు పచ్చబారేలా చేసిన కాళేశ్వరం జలధారలు చూసి కాంగ్రెస్ నాయకుల కళ్లు ఎర్రబడుతున్నాయని పేర్కొన్నారు.
Ex Mla Jeevan Reddy | కేసీఆర్‌పై కక్ష సాధింపులు..
తెలంగాణ రాష్ట్రం బాగుపడటం ఓర్వలేని ద్రోహులంతా ఒక్కటై కేసీఆర్‌పై(KCR) కక్ష గట్టారని, తెలంగాణ రాష్ట్రం తెచ్చి దశాబ్దాల కల నెరవేర్చడమే కాక అద్భుతమైన పాలనతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తొలి సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
పచ్చని తెలంగాణను మళ్లీ ఎండబెట్టే కుట్రలు చేస్తున్నారని, తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రేవంత్, మోదీ, చంద్రబాబు కుయుక్తులను ఎండగడతామని, కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.