అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది. హైదరాబాద్(Hyderabad), మేడ్చల్ జిల్లా(Medchal District)లు మినహా మిగతా 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో గ్రామాలు లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికలు మాత్రమే నిర్వహించనున్నారు.
అయితే ములుగు జిల్లా(Mulugu District)ల్లోని పలు గ్రామాల్లో సైతం ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్రంలోని పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రజలు ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. అయితే ములుగు జిల్లాలోని పలు గ్రామాలకు మాత్రం ఎన్నికల సంఘం(Election Commission) షెడ్యూల్ విడుదల చేయలేదు. సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఆ జిల్లాలోని 14 ఎంపీటీసీ, 25 గ్రామ పంచాయతీ, 230 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అలాగే కరీంనగర్ జిల్లాలోని రెండు పంచాయతీ, 16 వార్డు స్థానాలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.
Local Body Elections | సుప్రీంకోర్టు స్టే..
ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలపై సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవల స్టే విధించింది. మండలంలోని 25 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించింది. ఆ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని తీర్పు ఇచ్చింది.
దీనిపై ఆయా గ్రామాల్లోని గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు(High Court) ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ, 25 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొంది. అలాగే కరీంనగర్ జిల్లా వి. సైదాపురం మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్‌లో కూడా సర్పంచ్ ఎన్నికలు పెట్టడం లేదని తెలిపింది. కోర్టు తీర్పు అనంతరం ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.