అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | అన్ని పార్టీల్లో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె జాగృతి కార్యాలయం(Jagruti Office)లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మిక సంస్థ హెచ్ఎంఎస్తో జాగృతి పొత్తు పెట్టుకుందన్నారు.ఈ రెండు సంస్థలు కలిసి సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తాయన్నారు.
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇటీవల బీఆర్ఎస్పై వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పరోక్షంగా కేటీఆర్(KTR)ను ఉద్దేశిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సైతం ఆమె విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందన్నారు. కాంగ్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఏదైనా మాట్లాడితే.. అర గంటలోనే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తారని చెప్పారు. బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు ఈటల రాజేందర్(Eatala Rajender) డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో కూడా అలాగే ఉంటుందని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కవిత అన్నారు.
MLC Kavitha | కరప్షన్ గనిగా సింగరేణి..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చినప్పటి నుండి సింగరేణిని కరప్షన్ గనిగా మార్చిందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ అంచనాలు రాత్రికి రాత్రే పెంచారని ఆరోపించారు. దాదాపు రూ.1500 నుంచి రూ.2 వేల కోట్ల అంచనాలు పెంచారన్నారు. అలాగే సోలార్ ప్లాంట్లు పెట్టడంలో కూడా స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందన్నారు. దీనిని నిర్మూలించడానికి కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు.
MLC Kavitha | కార్మికులను మోసం చేశారు
నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ సర్కార్ అని కవిత విమర్శించారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 33 శాతం వాటా అని ప్రకటించి లాభాలను తక్కువగా చూపెట్టి మోసం చేశారన్నారు. ఈ సారి లాభాల్లో 35శాతం వాటా దసరా బోనస్ కింద జమ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి, సింగరేణి కార్మిక సంస్థ హెచ్ఎంఎస్(Singareni Labor Organization HMS) మధ్య పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. సింగరేణిలో ప్రస్తుతం గెలిచిన కూటమి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి లో అండర్ గ్రౌండ్ గనులను ఓపెన్ చేయాలన్నారు. అసంఘటిత, సంఘటిత కార్మికులతో త్వరలో సంఘం ఏర్పడుతుందన్నారు. దీనిలో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజుద్దీన్(HMS President Riazuddin) పాల్గొన్నారు.