అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Long Term Investment | మూడు దశాబ్దాల క్రితం(Three decades back) ఓ వ్యక్తి లక్ష రూపాయలతో షేర్లు కొన్నాడు. ఆ తర్వాత వాటిని మర్చిపోయాడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన తనయుడికి ఆ పేపర్లు కనిపించాయి. వాటిని పరిశీలించి.. వాటి విలువ తెలుసుకుని ఎగిరి గంతేశాడు. తన తండ్రి అప్పట్లో చేసిన లక్ష రూపాయల ఇన్వెస్ట్‌మెంట్(Investment) విలువ రూ. 80 కోట్లకు పెరగడంతో అతడి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆ విషయాన్ని సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియా(Social media) ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేశాడు.
ఒక వ్యక్తి తన తండ్రి 1990లలో కొన్న షేర్లు బయటపడినట్లు రెడిట్ పోస్టులో బహిర్గతం చేశాడని పేర్కొన్నాడు. ఇది వైరల్‌గా మారింది. అయితే ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియలేదు. ఎక్స్(X) పోస్ట్‌లోని వివరాలను బట్టి ఓ వ్యక్తి 1995 నవంబర్‌లో లక్ష రూపాయల విలువైన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (అప్పట్లో జిందాల్ విజయనగర్ స్టీల్‌గా వ్యవహరించేవారు. 2005లో పేరు మారింది) షేర్లు కొనుగోలు చేశాడు. వాటి పత్రాలను భద్రంగా దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆ షేర్లను ముట్టుకోలేదు. అవి మూడు దశాబ్దాల పాటు అలాగే ఉండిపోయాయి. ఇటీవల సదరు వ్యక్తి తనయుడికి ఆ ఫిజికల్ షేర్లు(Physical shares) కనిపించాయి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన షేర్ల ప్రస్తుత విలువ రూ. 80 కోట్లకు చేరిందని సౌరవ్ దత్తా(Sourav Datta) తన పోస్టులో తెలిపాడు.
Long Term Investment | కార్పొరేట్ యాక్షన్స్ తో పెరిగిన విలువ..
జేఎస్‌డబ్ల్యూ స్టీల్(JSW steel) కంపెనీ 1995లో స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యింది. అప్పట్లో ఒక్కో షేరు ధర రూ. 20 కంటే తక్కువ. ప్రస్తుతం ఒక్కో షేరు ధర వెయ్యి రూపాయలు దాటింది. గతంలో 10 రూపాయల ముఖ విలువ కలిగి ఉండేది. స్టాక్ స్ప్లిట్(Stock split) తర్వాత ఒక రూపాయికి మారింది. ఒక్కో షేరుపై వందలాది రూపాయల డివిడెండ్‌ను ఇచ్చింది. ఇలాంటి కార్పొరేట్ చర్యలతో సదరు వ్యక్తి లక్ష రూపాయల స్టాక్స్ విలువ కాంపౌండ్(Compound) అవుతూ వచ్చి రూ. 80 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఈ కథనానికి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ మాత్రమే ఆధారం. దీనిలో వాస్తవాలపై స్పష్టత లేదు. అయితే ఈక్విటీ మార్కెట్ల(Equity markets)లో దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రయోజనాలకు ఈ పోస్ట్ ఓ నిదర్శనంగా నిలుస్తుంది. మంచి కంపెనీలలో సరైన సమయంలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయన్న దానికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.