Homeబిజినెస్​Reliance | అప్పుడు జియో.. ఇప్పుడు కాంపా..మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌

Reliance | అప్పుడు జియో.. ఇప్పుడు కాంపా..మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reliance | రిలయన్స్‌(Reliance) సంస్థ సంచలనాలు సృష్టిస్తోంది. 2016లో ఉచిత కాల్స్‌, అన్‌లిమిటెడ్‌ డాటా అందించి జియో పేరుతో టెలికాం రంగంలో పెను సంచలనం రేపిన ఆ సంస్థ.. తాజాగా దేశీయ సాఫ్ట్‌ డ్రింక్‌(Soft drink) మార్కెట్‌లోనూ గట్టి పోటీదారుగా నిలుస్తోంది. విస్తృతమైన రిటైల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఆ సంస్థ.. కాంపా కోలాను కోకా కోలా, పెప్సీల వాటాను కొల్లగొడుతూ సాగుతోంది.

80వ దశకంలో భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లో కాంపా కోలా(Campa cola) అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా ఉండేది. అయితే దేశీయ మార్కెట్‌(Domestic market)లోకి కోకా కోలా రాకతో పరిస్థితి మారిపోయింది. ఆ కంపెనీ మార్కెటింగ్‌ కోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడంతో తట్టుకోలేక కాంపా కోలా వ్యాపారం దెబ్బతింది. ఆ కంపెనీని 2022లో రిలయన్స్‌ తన సబ్సిడరీ కంపెనీ అయిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌(RCPL) ద్వారా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.22 కోట్లు మాత్రమే వెచ్చించింది. అనంతరం 2023లో కాంపా కోలా సాఫ్ట్‌ డ్రింక్‌ను రీలాంచ్‌ చేసింది. రీలాంచ్‌ అయిన అనతి కాలంలోనే ప్రధాన సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీలకు పోటీదారుగా మారింది. కేవలం 18 నెలల వ్యవధిలోనే రూ. వెయ్యి కోట్ల ఆదాయం మార్క్‌ను దాటింది.

Reliance | ధరల వ్యూహంతో మార్కెట్‌ షేర్‌ పెంచుకుంటూ..

రిలయన్స్‌ కంపెనీ(Reliance Company) సామాన్యులకు అందుబాటు ధరలలో తన కాంపా కోలాను తీసుకువచ్చింది. ప్రధానంగా రూ. 10కే 200 ml బాటిల్‌ను, రూ. 20కే 500 ml బాటిల్‌ను అందిస్తోంది. ఇవి సాఫ్ట్‌డ్రింక్‌ మార్కెట్‌లో కాంపా కోలా వాటాను పెంచడానికి దోహదం చేస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలతో ఈ శీతల పానీయం(Cool drink) బ్రాండ్‌ పది శాతానికిపైగా మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోగలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దీని వాటా 20 శాతానికి చేరినట్లు అంచనా.

Reliance | మార్కెటింగ్‌కు వ్యూహాలు..

రిలయన్స్‌ కంపెనీ కాంపా కోలా(Campa Cola) బాటిల్‌ ధరతోపాటు మార్కెటింగ్‌ వ్యూహాలతో సాఫ్ట్‌డ్రింక్‌ మార్కెట్‌లో వాటా పెంచుకుంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 19 వేలకుపైగా రిటైల్‌ స్టోర్లు(Retail stores) ఉన్నాయి. ఆయా స్టోర్లలో కాంపాకోలాను అందుబాటులో ఉంచింది. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటుడు రాంచరణ్‌(brand ambassador Ram Charan)ను నియమించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే రిటైల్‌ విక్రేతలకు ఎక్కువ మార్జిన్లు అందిస్తోంది. ఇతర కంపెనీలు రిటైల్‌ వ్యాపారులకు 5 శాతం వరకు మార్జిన్‌ ఇస్తుండగా.. రిలయన్స్‌ 8 శాతం వరకు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో రిటైల్‌ వ్యాపారులు కాంపా కోలాను విక్రయించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో దేశీయ శీతల పానీయాల మార్కెట్‌లో రిలయన్స్‌ వాటా పెరుగుతోంది. అంతేకాక అంతర్జాతీయ మార్కెట్‌లోకి తన సాఫ్ట్‌డ్రింక్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే యూఏఈలో కాంపా కోలా, కాంపా లెమన్‌, కాంపా ఆరెంజ్‌, కాంపా జీరో వంటి ఉత్పత్తులను విక్రయిస్తూ ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లోనూ సత్తా చాటడానికి సన్నాహాలు చేస్తోంది.