అక్షరటుడే, భీమ్ గల్ : Balkonda | బాల్కొండ మండల కేంద్రంలో తాళం వేసిన ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లారు. బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పుట్టి సుమంతి తీర్థయాత్రలకు వెళ్లింది. యాత్రలు ముగించుకొని ఆదివారం ఉదయం ఇంటికి చేరుకుంది. ఇంటి తాళం పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించింది.
ఇంట్లో ఉన్న బీరువా పగులగొట్టి 6.7 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. అలాగే గ్రామానికి చెందిన సంతోష్ ఇంట్లో చొరబడి దేవుని హుండీ పగులగొట్టి రూ. పది వేలు ఎత్తుకెళ్లారు. కాగా.. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.