అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలోని శ్రీవారి ఆలయం (Srivari Temple)లో పరకామణి (Parakamani) వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో 20 ఏళ్లుగా చోరీకి పాల్పడుతున్నట్లు భూమన తెలిపారు. తమ హయాంలోనే ఆయనను పట్టుకున్నట్లు చెప్పారు. గతంలో చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఉన్న సమయంలో కూడా రవికుమార్ చోరీ చేశాడన్నారు. అప్పుడు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. తాను ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే రవికుమార్ చోరీ చేస్తున్న విషయాన్ని బయట పెట్టామన్నారు. ఆయన నుంచి రూ.100కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు. దమ్ముంటే విజిలెన్స్ రిపోర్ట్ (Vigilance Report) బయటపెట్టాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సవాల్ చేశారు.
Tirumala | సీబీఐతో విచారణ చేయించాలి
పరకామణిలో చోరీ విషయమై మంత్రి నారా లోకేశ్ (Nara Lokseh), టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. ఈ కేసును సీఐడీతో కాకుండా సీబీఐ (CBI)తో విచారణ చేయించాలన్నారు. దొంగతనానికి పాల్పడిన రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో సైతం ఆస్తులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Tirumala | తల నరుక్కుంటా
తన హయాంలో ఈ ఘటన జరిగిందే నిజమైతే అలిపిరి దగ్గర తల నరుక్కుంటానని కరుణాకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయలకు అడ్డగా మార్చిందని విమర్శించారు. 2023లోనే రవి కూమార్ పరకామణిలో 800 డాలర్లు చోరీ చేయగా పట్టుకున్నామన్నారు. విజిలెన్స్ వాళ్లను బెదిరించి ఆ సీసీ టీవీ వీడియోలను ప్రస్తుతం బయట పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన చోరీలపై వీడియోలు సైతం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.