అక్షరటుడే, వెబ్డెస్క్ : Mulugu | ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. రీల్స్, షార్ట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఫేమస్ కావాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ (Reels) కోసం అడవిలోకి వెళ్లి తప్పిపోయాడు.
ములుగు జిల్లాకు (Mulugu District) చెందిన అబ్రార్ అనే యువకుడు సోమవారం జిల్లాలోని అటవీ ప్రాంతంలో గల ముత్యంధార జలపాతం (Mutyamdhara Falls) సందర్శనకు ఒంటరిగా వెళ్లాడు. రీల్స్ చేయడానికి మొబైల్ పట్టుకొని అక్కడకు వెళ్లాడు. తాపీగా రీల్స్ చేసుకొని సాయంత్రం పూట తిరిగి ఇంటికి బయలు దేరాడు. అయితే దట్టమైన అటవీ ప్రాంతం (Dense Forest Area) కావడంతో దారి మరిచిపోయాడు. అడవిలో తప్పిపోయాడు.
Mulugu | డయల్ 100కు ఫోన్
రీల్స్ కోసం వెళ్లిన అబ్రార్ అడవిలో దారి దొరకక భయాందోళనకు గురయ్యాడు. చీకటి పడుతుండడంతో ఏం చేయాలో తోచక వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ (Search Operation) నిర్వహించారు. సుమారు ఆరు గంటల పాటు అడవిలో గాలించగా యువకుడి ఆచూకీ దొరికింది.
Mulugu | కేసు నమోదు
ముత్యంధార జలపాతం దట్టమైన అటవీ ప్రాతంలో ఉంది. అక్కడికి ఎవరినీ అనుమతించరు. దీంతో కొందరు యువకులు అధికారులకు తెలియకుండా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అబ్రార్ సైతం అలాగే వెళ్లి తప్పిపోయాడు. నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన ఆయనపై అటవీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
Mulugu | అక్కడకు వెళ్లొద్దు..
ముత్యంధార జలపాతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందని, అక్కడికి ఎవరికీ అనుమతి లేదని అటవీ శాఖ అధికారులు (Forest Officers) తెలిపారు. యువకుడి కోసం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు గాలించినట్లు వారు పేర్కొన్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువకుడి ఆచుకీ కనుగొని బయటకు తీసుకు వచ్చామన్నారు. నిషేధిత జలపాతాలకు కొందరు దొంగచాటుగా వెళ్తున్నారన్నారు. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని, ల్యాండ్మైన్లు, ప్రెషర్ బాంబులు ఉండే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పర్యాటకులు నిషేధిత ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
