అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | వర్కర్ టు ఓనర్ పథకాన్ని (Worker to Owner scheme) సంక్రాంతిలోపు అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు.
ఈ పథకాన్ని అమలు చేయకపోతే సిరిసిల్లలో (Sircilla) 10 వేల మందితో మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) గత రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ, పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వాలంటే పవర్ లూమ్లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేటాయించాలని డిమాండ్ చేశారు.
KTR | పెద్ద ఎత్తున ఆందోళనలు
సంక్రాంతి (Sankranthi) లోపల ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలను, నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామన్నారు. సిరిసిల్ల నేత కార్మికులను కేసీఆర్ (KCR) కంటికి రెప్పలా కాపాడారని చెప్పారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.3,400 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించామని గుర్తు చేశారు. కార్మికుడిని ఆసామిగా మార్చే విప్లవాత్మక ఆలోచనతో ‘వర్కర్ టు ఓనర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
KTR | నిరుపయోగంగా అపెరల్ పార్క్
బీడీలు చుడుతూ అనారోగ్యం పాలు అవుతున్న మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరల్ పార్కును బీఆర్ఎస్ హయాంలో నిర్మించామని కేటీఆర్ తెలిపారు. దాదాపు 50 షెడ్ల నిర్మాణాలు రెండేళ్ల కిందటే పూర్తయ్యాయని చెప్పారు. అయితే కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో షెడ్లన్నీ నిరుపయోగంగా మారి, పిచ్చి మొక్కలు పెరిగాయన్నారు.