అక్షరటుడే: బోధన్ : Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపాలిటీలో నిర్వహించిన ఆల్‌పార్టీ సమావేశంలో నాయకులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో సమావేశం కొద్దిసేపు రసాభాసగా సాగింది.
Bodhan Municipality | వందల ఓట్లు తారుమారు..
మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో వందల సంఖ్యలో ఓట్లు తారుమారయ్యాయని వాటిని సవరించాలని నాయకులు సూచించారు. 27వ వార్డు నుంచి 160 ఓట్లు 32 వార్డుకు బదిలీ అయ్యాయని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఇలియాస్ (MIM Party President Ilyas) ఆరోపించారు. అదేవిధంగా 33 వార్డులో 60 ఓట్లు తప్పుగా నమోదయ్యాయని ప్రతి వార్డులో కూడా ఓటర్లు తప్పులు తడకగా నమోదు చేశారని వీటిని సవరించాలని వివిధ పార్టీల నాయకులు సూచించారు.
Bodhan Municipality | కొత్త ఓట్ల నమోదు, తొలగింపు మా చేతుల్లో లేదు..
అయితే జాబితాలో కొత్తగా ఓట్లు నమోదు చేయడం, తీసివేయడం తమ చేతిలో లేదని మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) జాదవ్ కృష్ణ తెలిపారు. కేవలం ఓటు షిఫ్టింగ్ మాత్రమే తమ చేతిలో ఉందని వాటిని మాత్రమే సవరిస్తామని కమిషనర్ చెప్పారు. తాము సూచించిన అభ్యంతరాలను సరిచేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఎంఐఎం నాయకులు (MIM Party Leaders) తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఇలియాస్, ఆమ్ ఆద్మీ నాయకుడు జునైత్ ఖాన్ పాల్గొన్నారు.