అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని మాగి (maagi) గ్రామానికి చెందిన ప్రముఖ భజన గాయకుడు, గ్రామీణ కళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గుర్రపు ఆకుల రాములు (60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు.
రాములు చిన్న వయసులోనే భజన సంకీర్తనల (Bhajana Sankirtanalu) పట్ల ఆసక్తి పెంచుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన గళం ఊరూరా దేవాలయాల్లో భక్తి గీతాలతో సుపరిచితం. భజనను గాన రూపంలోనే కాకుండా, ఆధ్యాత్మిక సందేశాన్ని పంచే వేదికగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర విశేషమైంది. అందువల్లే ప్రజలు ఆయనను ప్రేమతో ‘గాన గంధర్వుడు’, ‘భజనసంకీర్తనల చక్రవర్తి’గా పిలుచుకుంటారు.
ఆయన మరణవార్త తెలిసి గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలకు వందలాది మంది భక్తజనం, బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్థులు హాజరై కన్నీటి నివాళులర్పించారు. మాగి గ్రామంలోని శ్రీ సంతోషిమాత భజన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమాలతో అంతిమయాత్ర నిర్వహించారు.