అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat elections | రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) ముగిశాయి. మూడు విడతల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం ఏదైనా కారణాలతో ప్రత్యేకాధికారుల పాలన తెస్తే ఆలస్యం అవుతాయి. ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని (Adilabad district) ఓ గ్రామంలో మాత్రం 69 ఏళ్లలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆ గ్రామస్తులు తొలిసారి ఓటు వేసి సర్పంచ్‌ను గెలిపించుకున్నారు.
Panchayat elections | ప్రతిసారీ ఏకగ్రీవం
పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి చాలా గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే చాలా వరకు ఏకగ్రీవాలు వేలంపాట, ఆలయాలు, కుల సంఘాలకు డబ్బులు ఇవ్వడం ద్వారా చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా డబ్బులు పెట్టి పదవులు కొనుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో (Barampur Gram Panchayat) ఏడు దశాబ్దాలుగా సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. దీంతో 1956 నుంచి ఆ గ్రామంలో ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ప్రతిసారి గ్రామపెద్దలు నిర్ణయించి ఏకగ్రీవం చేసేవారు. అయితే ఈ ఏడాది ఆ ఆనవాయితీకి బ్రేక్ పడింది. దీంతో గ్రామస్తులు తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశారు.
Panchayat elections | ఇద్దరు బరిలో దిగడంతో..
బరంపూర్ గ్రామంలో 2,300 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఈ సారి కూడా సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామపెద్దలు అనుకున్నారు. అయితే ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలుస్తామని పట్టుబట్టారు. బీఆర్ఎస్ మద్దతుతో మెస్రం దేవ్‌రావు, సిడాం లక్ష్మణ్ రావు కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగారు. దీంతో మూడో విడతలో అక్కడ ఎన్నికలు జరిగాయి. తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామంలో ఎన్నికలు నిర్వహించి సర్పంచ్‌ను ఎన్నుకున్నారు.