అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఉదయం నుంచే జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
చాలాచోట్ల నిర్దేశిత గడువు తర్వాత కూడా ఓటర్లు లైన్లలో ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించారు.
Panchayat Elections | భారీగా పోలింగ్ నమోదు..
తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో గల 4,236 సర్పంచ్, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (Election Commission) నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, 396 సర్పంచ్, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,834 సర్పంచ్ స్థానాల కోసం 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయా గ్రామాల్లో పోలింగ్ నిర్వహించగా, ఓటర్లు తరలి వచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల (Polling Centers) వద్ద బారులు తీరారు. దీంతో భారీగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా కలిపి 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఒంటి గంట తర్వాత కూడా జనం లైన్లలో ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు పేర్కొంది.
Panchayat Elections | కనిపించని అభ్యర్థి గుర్తు.. ఆగిన పోలింగ్..
నాగర్ కర్నూల్ జిల్లా (Nagarkurnool District) వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఆ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. ఇద్దరికి సంబంధించిన గుర్తులు మాత్రమే బ్యాలెట్ పత్రాల్లో కనిపించాయి. మరో అభ్యర్థికి సంబంధించిన గుర్తు కేటాయించకపోవడంతో గమనించిన ఓటర్లు షాక్ కు గురయ్యారు. ఒక అభ్యర్థికి గుర్తు కేటాయించక పోవడం తో మూడో అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫర్యాదు చేయగా.. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత వేరే బ్యాలెట్ పత్రాలు తీసుకొచ్చి, ఓట్ల ప్రక్రియ చేపట్టారు.
Panchayat Elections | పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత..
పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సందర్భంగా పలుచోట్ల కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లోనే ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రత్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కాంగ్రెస్ (Congress) , బీఆర్ ఎస్ (BRS) నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.కేతెపల్లి మండలం కుర్లపల్లిలో ఇరువర్గాలు వారు కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.