HomeతెలంగాణTelangana Police | బెట్టింగ్​పై అవగాహన కల్పించాల్సిన వారే.. బానిసలు అవుతున్నారు

Telangana Police | బెట్టింగ్​పై అవగాహన కల్పించాల్సిన వారే.. బానిసలు అవుతున్నారు

ఆన్​లైన్​ బెట్టింగ్​పై అవగాహన కల్పించాల్సిన పోలీసులే దానికి బానిసలు మారుతున్నారు. రాష్ట్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు బెట్టింగ్​తో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Police | దేశంలో ఆన్​లైన్​ బెట్టింగ్​ (Online Betting)పై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో బెట్టింగ్​ యాప్​లపై నిషేధం అమలులో ఉంది. అయితే కొందరు ఫేక్​ లోకేషన్​తో బెట్టింగ్​లకు పాల్పడుతున్నారు. అయితే బెట్టింగ్​తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు.. దానికి బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు బెట్టింగ్​తో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా మరో కానిస్టేబుల్​ అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రహమత్​నగర్​కు చెందిన రమేశ్​ 2018లో 1వ బెటాలియన్ కానిస్టేబుల్​గా ఎంపికయ్యాడు. అయితే ఆయన బెట్టింగ్​కు బానిసగా మారి అప్పుల పాలు అయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల బ్యాంకు నుంచి లోన్ డబ్బు తీసుకున్నాక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త జాడ తెలియక ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Telangana Police | ఇద్దరి ఆత్మహత్య

ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసగా మారి సంగారెడ్డి (Sangareddy) మహబూబ్ సాగర్ చెరువుకట్టపై ఇటీవల కానిస్టేబుల్​ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కల్హేర్‌కి చెందిన సందీప్ సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేసేవాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి భారీగా డబ్బులు నష్టపోయాడు. దీంతో పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు తిరిగి అడగడంతో సందీప్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్​ నగరంలో ఉప్పల్ (Uppal)లో​ మరో కానిస్టేబుల్ సైతం నవంబర్​ 8న ఉరి వేసుకున్నాడు. 2009 బ్యాచ్​కు చెందిన శ్రీకాంత్​ ఫిలిం నగర్​ ఠాణాలో పని చేసేవాడు. అయితే ఆన్​లైన్​ బెట్టింగ్​కు బానిసైన ఆయన.. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణం తీసుకున్నాడు.

కాగా ఆన్​లైన్​ బెట్టింగ్​ చట్టరిత్యానేరం. ఆ విషయం తెలిసిన పోలీసులే దానికి బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, బెట్టింగ్​కు పాల్పడే వారిని అరెస్ట్​ చేయాల్సిన పోలీసులు దానికి అలవాటు పడుతుండటం గమనార్హం.

Telangana Police | సీపీ సజ్జనార్​ ఆందోళన

పోలీస్​ సిబ్బంది ఆన్​లైన్​ బెట్టింగ్​కు బానిసలుగా మారుతుండటంపై హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల ఆత్మహత్యలపై ఆయన ఎక్స్​ వేదికగా ఇటీవల స్పందించారు. ఆన్ లైన్ బెట్టింగ్ మహమ్మారి అనర్థాలను నలుగురికి అవగాహన కల్పించాల్సిన కానిస్టేబులే.. దానికే వ్యసనపరుడై బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. జీవితంలో ఒడిదొడుకులు సహజమని, సమస్యకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని ఆయన తెలిపారు.

Must Read
Related News