అక్షరటుడే, వెబ్‌డెస్క్: Venezuela Attack | వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (President Nicolás Maduro), అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను బంధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Former Vice President Kamala Harris) విమర్శించారు. ఈ ఆపరేషన్ చమురు ప్రయోజనాలతో నడిచిందని, మాదకద్రవ్యాల గురించి కాదన్నారు.
వెనిజులా నుంచి తమ దేశంలోకి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని ట్రంప్ (US President Donald Trump) పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతోనే ఆ దేశ అధ్యక్షుడిని బంధించినట్లు ఆరోపించారు. అయితే వెనిజులాలో ఉన్న చమురు నిల్వల కోసమే ట్రంప్ ఈ పని చేశారని కమలా హారిస్ పేర్కొన్నారు. ట్రంప్ సైతం మదురో అరెస్ట్ అనంతరం వెనిజులాలోని చమురు నిల్వలను అమెరికా కంపెనీలు చూసుకుంటాయని చెప్పారు.
Venezuela Attack | అమెరికాకు నష్టం
ట్రంప్ తాజా చర్యలపై హారిస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వెనిజులాలో ట్రంప్ చర్యలు అమెరికాకు సురక్షితం కాదన్నారు. దేశానికి నష్టం కలిగించేలా ఆయన చేస్తున్నారని విమర్శించారు. బలవంతపు పాలన మార్పు ఈ ప్రాంతాన్ని అస్థిరపరచగలదని, అమెరికన్ జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. అమెరికన్ ప్రజలు ఇటువంటి సైనిక చర్యలకు మద్దతు ఇవ్వలేదని, ట్రంప్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అమెరికన్ ప్రజలు దీన్ని కోరుకోవడం లేదన్నారు. వెనిజులాపై దాడి మాదకద్రవ్యాలు, ప్రజాస్వామ్యం గురించి కాదని చెప్పారు. చమురు కోసం, ప్రాంతీయ బలమైన వ్యక్తిగా నటించాలనే డొనాల్డ్ ట్రంప్ కోరిక గురించి అని ఆరోపించారు. కాగా వెనిజులా దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కలిగి ఉంది.
Venezuela Attack | మనం ఎలా ప్రశ్నిస్తాం
భారత సంతతికి చెందిన యూఎస్ ఎంపీ రో ఖన్నా సైతం వెనిజులాపై దాడిని ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని అరెస్ట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. చైనా తైవాన్‌పై దాడి చేసినా మనం ఎలా ప్రశ్నించగలమన్నారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా మదురోను బంధించడాన్ని విమర్శించారు. దీనిని యుద్ధ చర్య, అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా అభివర్ణించారు.