అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం రాత్రితో ముగియనున్నాయి. పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా డిసెంబర్ 30 నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. గతేడాది తొక్కిసలాట చోటు చేసుకోవడంతో టీటీడీ అధికారులు (TTD Officers) ఈ సారి పక్కాగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ దర్శనాలకు అనుమతి ఇచ్చారు. నేడు అర్ధరాత్రి ఉత్తర ద్వారాన్ని అధికారులు మూసి వేయనున్నారు. బుధవారం వరకు స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా 7,09,831 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఒక్క రోజే 85 వేలకు పైగా భక్తులు రావడం గమనార్హం. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా ఉంది.
Tirumala | రేపటి నుంచి ప్రత్యేక దర్శనాలు
వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఈ ఏడాది టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది. దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు పంపిణీ చేశారు. అయితే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. రేపటి నుంచి ప్రత్యేక దర్శన సేవలు (Special Darshan Services) యథావిధిగా కొనసాగనున్నాయి.