అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahavatar Narasimha | మహావతార్ నరసింహా సినిమా సంచలనం సృష్టిస్తోంది. తొలి యానిమేషన్ మూవీగా తెరపైకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొడుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.
అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన మహావతార్ నరసింహా (Mahavatar Narasimha Movie) రూ.400 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి పరుగులు పెడుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గత జూలై 25న రిలీజ్ అయిన ఈ యానిమేషన్ మూవీ (Animation Movie).. నాలుగు వారాలుగా భారీగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. కూలీ, వార్ 2 వంటి పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ, ఈ చిత్రానికి మాత్రం ఆదరణ తగ్గలేదు.
Mahavatar Narasimha | తక్కువ బడ్జెట్‌లో..
మహావతార్ నరసింహ సినిమాను హోంబళే ఫిలిమ్స్ (Hombale Films), క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో (Cleem VFX Studio) సంయుక్తంగా నిర్మించాయి. నటీనటులు లేని ఈ మూవీలో యానిమేషన్, వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ వంటివి కీలక పాత్ర పోషించాయి. దర్శకుడు అశ్విన్‌కుమార్ తన మాయాజాలంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
అతి తక్కువ బడ్జెట్‌లో మహా విష్ణువు అవతారమైన నరసింహా ఆధారంగా కన్నడలో రూపొందించిన ఈ మూవీని తెలుగుతో పాటు పలు భాషలలో విడుదల చేశారు. పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ మూవీ తొలిరోజు కేవలం రూ.1.75 కోట్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత పది రోజుల వ్యవధిలోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం రూ.400 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా వెళ్తోంది. ఇండియాలోనే కాదు.. అటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Mahavatar Narasimha | పెద్ద చిత్రాల పోటీని తట్టుకుని..
తొలి యానిమేషన్ చిత్రంగా విడుదలైన మహావతార్ నరసింహకు వస్తున్న స్పందన పెద్ద చిత్రాలకు సైతం లభించక పోవడం విశేషం. నరసింహకు బాలీవుడ్, దక్షిణ భారత చిత్ర పరిశ్రమల నుంచి అనేక సినిమాలు పోటీగా వచ్చాయి. హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కూలీ’ పోటీకి వచ్చినప్పటికీ యానిమేటెడ్ ఫాంటసీ డ్రామా చిత్రం మహావతార్ నరసింహ ప్రేక్షకులను కట్టిపడేసింది. అశ్విన్ కుమార్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం టికెట్ కౌంటర్ల వద్ద వార్ 2. కూలీ వంటి పెద్ద బడ్జెట్ కొత్తగా విడుదలైన చిత్రాలకు గట్టి పోటీని ఇస్తోంది. ఈ మూవీ ఒక్క ఇండియాలోనే రూ. 215.60 కోట్లు వసూలు చేసింది.