అక్షరటుడే, వెబ్డెస్క్ : Gokarna temple | కర్ణాటక రాష్ట్రంలోని (Karnataka state) ఉత్తర కన్నడ జిల్లాలో కొలువైన పుణ్యక్షేత్రం గోకర్ణ. గోకర్ణం అంటే ఆవు చెవి అని అర్థం. పౌరాణిక కథనాల ప్రకారం, ఇక్కడ గంగావళి, అఘనాశిని అనే రెండు నదులు చెవి ఆకారంలో సంగమిస్తాయి.
అందుకే ఈ ప్రాంతాన్ని గోకర్ణం అంటారని, లేదా భూమి తల్లి అయిన పృథ్వి ఆవు చెవి నుంచి శివుడు ఉద్భవించాడని భక్తులు నమ్ముతారు.
ఇక్కడి స్వామిని ‘మహాబలేశ్వరుడు’ (Mahabaleeshwara) అని పిలుస్తారు. గోకర్ణ క్షేత్ర (Gokarna temple) దర్శనం మోక్షానికి మార్గమని పురాణాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా, జీవితంలో అరుదుగా లభించే కొన్ని విశేషాలు ఒకేసారి దొరికితే.. భక్తులు తప్పక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ నియమాలు, క్షేత్రం వెనుక ఉన్న రావణాసురుడి (Ravana) ఆత్మలింగం కథా విశేషాలు తెలుసుకుందాం.
మోక్షం కోసం 4 అరుదైన యోగాలు: జీవితంలో ఎప్పుడైనా ఈ నాలుగు అరుదైన యోగాలు ఒకేసారి కలిస్తే, అంతటి ధన్యాత్ములు ఎవరూ ఉండరు.
అలాంటి వారు మారేడు దళాన్ని ఒక శివలింగంపై (Shiva Linga) సమర్పిస్తే మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
గోకర్ణ క్షేత్ర దర్శనం: గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి చీతిలో మారేడు దళం తీసుకోవాలి. ఆ దళాన్ని శివలింగానికి సమర్పించాలి.
మహాబలేశ్వరుడి భావన: అక్కడ ఏ రాయి తగిలినా అది శివలింగంగా భావిస్తూ, స్వామి ‘మహాబలేశ్వరుడిని’ దర్శించుకోవాలి.
పవిత్ర తిథి: అదృష్టం బాగుండి, అది కృష్ణ చతుర్దశి (మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి) (Maha Shivaratri) అయి ఉంటే ఇంకా మంచిది.
త్రేతాయుగంలో ఆత్మలింగం కథ: త్రేతాయుగంలో, లంకాధిపతి అయిన రావణాసురుడు పరమశివుడి గురించి అకుంఠిత తపస్సు చేసి, శివుడిని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని (Atmalingam) వరంగా పొందుతాడు.
ఈ లింగం స్వభావం ప్రకారం.. దానిని భూమిపై ఎక్కడ పెట్టినా అక్కడే స్థాపితమై పోతుంది. తర్వాత తిరిగి ఎత్తడం ఎవరికీ సాధ్యం కాదు.
రావణుడు ఆత్మలింగాన్ని లంకలో (Sri Lanka) ప్రతిష్ఠిస్తే, దాని ప్రభావంతో లోకానికి ముప్పు వాటిల్లుతుందని దేవతలు భయపడి శ్రీమహా విష్ణువును వేడుకుంటారు.
విష్ణువు మాయ: విష్ణుమూర్తి తన మాయతో వాతావరణాన్ని సృష్టించి, సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తారు. సూర్యాస్తమయం అయిందని భావించిన రావణుడు సంధ్యావందనం (సంధ్య వార్చుకోవడం) కోసం సిద్ధమవుతాడు.
వినాయకుడి పాత్ర: అప్పుడు నారదమునీంద్రుడు సూచన మేరకు, గణపతి ఒక బాల బ్రాహ్మణుడి వేషంలో రావణుడి వద్దకు వెళ్తారు. సంధ్యా వందనం పూర్తి అయ్యే వరకు లింగాన్ని పట్టుకోవాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిపై పెట్టవద్దని రావణుడు గణపతిని (Ganapathi) కోరతాడు.
గణపతి షరతు: బాల బ్రాహ్మణ వేషంలో ఉన్న గణపతి, లింగం బరువుగా ఉంటే ఎక్కువసేపు మోయలేనని, బరువు పెరిగినప్పుడు మూడుసార్లు పిలుస్తానని, వెంటనే రాకపోతే కింద పెట్టేస్తానని హెచ్చరిస్తాడు.
లింగ స్థాపన: సంధ్యా వందనం మధ్యలో ఉన్న రావణుడు రాలేకపోవడంతో, గణపతి మూడుసార్లు పిలిచి, లింగాన్ని భూమిపై పెట్టేస్తారు.
కోపోద్రిక్తుడైన రావణుడు: వెంటనే విష్ణువు తన మాయను తొలగించగా, ఆకాశంలో సూర్యుడు మళ్లీ కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో, బాలబ్రాహ్మణుడి (గణపతి) నెత్తిపై మొట్టుతాడు. రావణుడు వచ్చి ఆత్మలింగాన్ని తన శక్తినంతా ధారపోసి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాదు.
ఆత్మలింగం భాగాలు పడిన ప్రదేశాలు: రావణుడు ఆత్మలింగాన్ని ఎత్తలేక, దాని భాగాలను కోపంతో విసిరి వేయగా, ఆ భాగాలు పడిన ప్రదేశాలే నేడు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి.
కవచం విసిరివేసిన ప్రదేశం: గోకర్ణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జేశ్వర.
మూత తొలగించి విసిరివేసిన ప్రదేశం: గోకర్ణానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర.
లింగంపై ఉన్న వస్త్రం విసిరివేసిన ప్రదేశం: కందుక పర్వతంపై ఉన్న మృదేశ్వర (ఈ పేరే కాలక్రమంలో మురుడేశ్వర్‌గా మారింది).
ఈ విధంగా గోకర్ణ క్షేత్రం ఆత్మలింగం చారిత్రక, పౌరాణిక విశిష్టతను కలిగి ఉంది.