అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yeallreddy | మండలంలోని తిమ్మానగర్ చెరువు (Timmanagar Cheruvu) కట్టకు అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. చెరువు కట్ట తెగిపోయిన ప్రాంతంలో బుధవారం ఇసుక సంచులతో అడ్డుకట్ట వేశారు. తిమ్మానగర్ చెరువు కట్ట తెగి నీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ‘అక్షరటుడే’లో సెప్టెంబర్ మొదటి వారంలో కథనం ప్రచురితమైంది.
అప్పట్లో అధికారులు స్పందించకపోవడంతో రైతులు ముందుకొచ్చి తలోచేయి వేసి స్వచ్ఛందంగా కట్టకు మరమ్మతులు సైతం చేపట్టారు. అయితే 24 గంటల్లోనే భారీ వర్షం రావడంతో వారు చేసిన పని వృథా అయ్యింది.
దీంతో రైతుల కష్టం నీటిపాలైందని సైతం ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు గండిపడిన చోట భారీ ఎత్తున ఇసుక సంచులు వేసి కట్ట బలోపేతానికి కృషి చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.