అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal Mandal | భీమ్గల్ తహశీల్దార్ కార్యాలయాన్ని (Bheemgal Tahsildar office) తక్షణమే పట్టణంలోకి మార్చాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Bheemgal Mandal | పట్టణానికి దూరంగా వాగు దగ్గర..
ప్రస్తుతం కార్యాలయం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో వాగుగడ్డ సమీపంలో ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీల (Grama panchayats) ప్రజలు తమ సమస్యల నివేదన కోసం ప్రతిరోజూ కార్యాలయానికి వస్తుంటారని ఆయన వివరించారు. అయితే మూడేళ్లుగా సరైన రోడ్డు మార్గం కూడా లేని చోట కార్యాలయం ఉండడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
Bheemgal Mandal | వారం రోజుల్లోగా తరలించాలి
అటవీ ప్రాంతం లాంటి ఆ ప్రదేశానికి చేరుకోవడం సామాన్యులకు భారంగా మారిందన్నారు. వారం రోజుల్లోగా కార్యాలయాన్ని పట్టణంలో సౌకర్యవంతంగా ఉండే ప్రాంతానికి తరలించాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ‘పోరుబాట’ చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే, కార్యాలయాన్ని ప్రజలకు చేరువగా తీసుకొచ్చేందుకు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.