అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | ఏసీబీ కేసులపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ వెలువరించిన తీర్పును తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఏసీబీ కేసుల ఎఫ్‌ఐఆర్‌లను గతంలో ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) ఆ పిటిషన్పై విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదని తేల్చి చెప్పింది. రద్దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Supreme Court | అసలు ఏం జరిగిందంటే..
అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి 2016 నుంచి 2020 మధ్య ఏసీబీ విజయవాడ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడ పోలీస్ స్టేషన్‌ను సీఆర్‌పీసీలోని సెక్షన్ 2(ఎస్) కింద పోలీస్ స్టేషన్‌గా నోటిఫై చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి దానికి అధికార పరిధి లేదని వారు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది.
Supreme Court | తప్పుపట్టిన సుప్రీం
హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వైఖరి న్యాయానికి విఘాతం కలిగించడమేనని జస్టిస్ సుందరేష్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులలోని ఎఫ్‌ఐఆర్‌లు, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తుపై హైకోర్టు ఇకపై ఎలాంటి పిటిషన్లను స్వీకరించకూడదని పేర్కొంది. “మా పరిశీలనలో ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడానికే హైకోర్టు అనవసరంగా శ్రమించింది’’ అని న్యాయమూర్తులు అన్నారు. ఆ కేసుల్లో దర్యాప్తును కొనసాగించడానికి ఏసీబీకి స్వేచ్ఛను ఇచ్చింది. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రతివాదులను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని వారికి సూచించింది.