అక్షరటుడే, బోధన్: Sub Collector Bodhan | మండలంలోని పలు పాఠశాలలను సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (District Parishad High School) విద్యా కార్యక్రమాలపై సబ్ కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన బేస్‌లైన్, మిడ్లైన్ పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యాసన స్థాయిని రికార్డుల ఆధారంగా విశ్లేషించారు.
Sub Collector Bodhan | స్వయంగా విద్యార్థులతో మాట్లాడుతూ..
విద్యార్థుల తెలుగు, ఇంగ్లిష్‌లో చదువుతున్న విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. విద్యార్థులు చూపిన ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ నాణ్యమైన బోధన అందిస్తున్నారన్నారు. ఇదే విధంగా నిరంతరం కృషి చేస్తే విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రశంసించారు. విద్యార్థులతో మాట్లాడారు. అలాగే పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Sub Collector Bodhan | మినార్పల్లిలో..
మినార్పల్లిలోని (Minarpalli) మండల ప్రాథమిక పాఠశాలను సబ్‌కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. పాఠశాలలో రెండో, మూడో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. చిన్నతరగతుల నుంచే అన్ని సామర్థ్యాలు సాధించేలా బోధన కొనసాగించాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంలో నైపుణ్యం సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌తో బోధన్ ఎంఈవో నాగయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.