అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2026 | ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
కేవలం రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గ్రీన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్ల భారీ మొత్తంతో గ్రీన్‌ను తమ జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా, మొత్తం మీద మూడో అత్యధిక ధర అందుకున్న ప్లేయర్‌గా గ్రీన్ రికార్డు సృష్టించాడు.
IPL 2026 | రికార్డ్ ధరతో..
గ్రీన్ ఇప్పటికే ఐపీఎల్‌కు పరిచయమే. 2023 సీజన్లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తరఫున ఆడిన అతడు, ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కు ట్రేడ్ అయ్యాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమానంగా రాణిస్తూ తాను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 29 మ్యాచ్‌లు ఆడిన గ్రీన్ 700కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపుతూ 16 వికెట్లు తీసి జట్టుకు కీలక విజయాల్లో భాగస్వామి అయ్యాడు.అయితే గ్రీన్ క్రికెట్ ప్రయాణం అంత సులువు కాదు. అతడు పుట్టుకతోనే క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని 2023లో స్వయంగా గ్రీన్ బహిరంగంగా వెల్లడించాడు. ప్రస్తుతం అతడి కిడ్నీలు కేవలం 60 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపాడు.
చిన్న వయసులోనే వైద్యులు అతడి జీవితంపై అనేక సందేహాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ గ్రీన్ (Cameron Green) వెనకడుగు వేయలేదు. కఠినమైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి పాటిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే క్రికెట్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. ఆరోగ్య సమస్యలు తన కెరీర్‌ను అడ్డుకోవనివ్వకుండా అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ గ్రీన్ అంతర్జాతీయ క్రికెట్లో స్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా మారి, బ్యాటింగ్‌లో పవర్ హిట్టర్‌గా, బౌలింగ్‌లో ఉపయోగకరమైన ఆప్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు ప్రపంచ క్రికెట్లో అత్యంత విలువైన ఆల్రౌండర్లలో ఒకడిగా గ్రీన్ పేరు నిలిచింది. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) జట్టులో గ్రీన్ చేరడంతో ఆ జట్టు సమతుల్యత మరింత బలపడుతుందని అభిమానులు భావిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో అతడి బ్యాటింగ్, అవసరమైనప్పుడు వేగవంతమైన బౌలింగ్ కోల్‌కతాకు పెద్ద ప్లస్ కానుంది. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఐపీఎల్ 2026లో గ్రీన్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఆశిస్తున్నారు.