అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ (Telangana) తిరోగమన దిశలో ప్రయాణిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. క్యాలెండర్లు మారుతున్న రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో బీఆర్ఎస్ డైరీ, క్యాలెండర్లను బుధవారం కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. క్యాలెండర్లు మారుతున్నా.. కాంగ్రెస్‌పై నమ్మకంతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి వైపు కాకుండా.. తిరోగమన దిశలో పయనిస్తోందని ఆరోపించారు.
KTR | యూరియా కోసం అవస్థలు
తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ (Congress) పాలనలో మళ్లీ వచ్చాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చలికాలంలో కూడా గంటల తరబడి క్యూలైన్లలో యూరియా కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే అసలైన బలం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ కార్యకర్తల (BRS Leaders) పోరాటాన్ని ఆయన ప్రశంసించారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గెలుపోటములు శాశ్వతం కాద్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ (KCR) స్థానం శాశ్వతమని కేటీఆర్ అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ను అణిచివేయడంతో ఎవరితో కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.