అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) విఫలమైందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏ ఒక్కనాడు పారిశుధ్యంపై ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదని, దీంతో విష జ్వరాల బారిన పడి ప్రజలు అప్పుల పాలవుతున్నారన్నారు.
సిద్దిపేట జిల్లా (Siddipet district) జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను హరీశ్‌రావు (Harish Rao) ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డెంగ్యూతో మరణించిన మహేశ్, శ్రావణ్ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణకు కేసీఆర్ రూ.300 కోట్లు ఇచ్చేవారని, రేవంత్ రెడ్డి 10 పైసలైన ఇవ్వలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో యూరియా నిల్లు. బెల్టు షాపుల ద్వారా మందు ఫుల్లు అని ఎద్దేవా చేశారు.
Harish Rao | పడకేసిన పాలన..
కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో పాలన పడకేసిందని, పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఒక్క తిమ్మూర్ గ్రామంలోనే దాదాపు 60 కుటుంబాలు డెంగ్యూతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో (KCR government) పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఊరురా ట్రాక్టర్ ట్రాలీ ఇచ్చి ప్రతి నెల గ్రామపంచాయతీకి నిధులు ఇచ్చేదని గుర్తు చేశారు. కానీ నేడు పంచాయతీ సెక్రెటరీలు అప్పుల పాలై సమ్మె ప్రకటించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
‘గ్రామపంచాయతీ వర్కర్లకు (Gram panchayat workers) జీతాలు రావడం లేదు. దోమలకు స్ప్రే చేద్దామన్నా, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా డబ్బులు లేవు. ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు. చెత్త సేకరణ జరగడం లేదు. ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయి. లక్షలకు లక్షలు ఆస్పత్రులకు దారపోయాల్సి వస్తోందని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై (government hospitals) ప్రజలకు నమ్మకం పోయి, వైద్యం కరువైపోయి ప్రైవేట్ లో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
Harish Rao | మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ
రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటించారా? కనీసం పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) దోమలు రాకుండా రాష్ట్రమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిందని తెలిపారు. పల్లెల్లో ప్రజలు, హాస్టళ్లలో విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. రైతులు (Farmers) రోడ్లపై పడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విష జ్వరాలు రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Harish Rao | చర్చకు సిద్ధమా?
గ్రామ పంచాయతీల నిర్వహణపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. కేసీఆర్ ఉన్నప్పుడు నెలకి రూ.300 కోట్లు గ్రామపంచాయతీలకు (gram panchayats) ఇచ్చేవారని, రేవంత్ రెడ్డి కనీసం పది పైసలైన ఇచ్చాడా? అని ప్రశ్నించారు. మీ ఇంటలిజెన్స్ నెట్వర్క్ (intelligence network) ఏం చేస్తున్నది.. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడమే తప్ప ప్రజల ఇబ్బందులను మీకు చెప్పడం లేదా.. నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాలపై కుట్రలు, కేసీఆర్ గారిని ఇబ్బందులు పెట్టడమే తప్ప నువ్వు చేసింది ఏముందని నిలదీశారు.
Harish Rao | యూరియా నిల్లు.. మందు మాత్రం ఫుల్లు
ప్రభుత్వ చేతగానితనం వల్లే యూరియా బస్తాల (urea bags) కోసం రైతులు మబ్బుల మూడు గంటలకు క్యూ లో నిలబడే పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. ‘యూరియా బస్తాలు దొరకడం లేదు కానీ ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులు మస్తు ఉన్నాయి. మందు మాత్రం ఫుల్లు యూరియా మాత్రం నిల్లు’ అని ఎద్దేవా చేశారు. మండలానికో వైన్ షాపు, బార్ షాపు (wine shop and a bar shop) పెడతాడట కానీ దవాఖానాలో ప్రజలకు మందులు లేవు, రైతులకు యూరియా సంచులు మాత్రం లేవన్నారు.
కల్యాణలక్ష్మి కింది ఇస్తామన్న తులం బంగారం దేవుడెరుగు కానీ యూరియా బస్తాలే బంగారం అయ్యాయి.. ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 26వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెచ్చి స్టాక్ పెట్టాం. ఇప్పుడు కనీసం 3,000 మెట్రిక్ టన్నులు కూడా రాలేదన్నారు. కేసీఆర్ (KCR) ఉన్నప్పుడు ఊరికే లారీలు వచ్చేది. యూరియాని అక్కడే అందించే వాళ్ళమని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పరిపాలన చాతకావడం లేదు అని. ఇప్పటికైనా తిట్టుడు బందు పెట్టి పాలనపై దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి. లేకపోతే జనాలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు.