అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Speaker | పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) హస్తం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం పది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‌ను కోరింది. దీనిపై ఆయన స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయా పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో తాజాగా స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషిన్లను కొట్టివేశారు.
Telangana Speaker | పార్టీ మారలేదని..
సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు మేరకు స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా 8 మంది హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిశామని వాదించారు. తమ జీతం నుంచి ప్రతినెలా బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ అవుతోందని చెప్పారు. వారి వాదనలతో ఏకీభవించిన స్పీకర్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్ అన్నారు. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. మిగతా వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.