HomeజాతీయంBihar Assembly Elections | బీహార్​లో మోగిన నగారా.. రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు

Bihar Assembly Elections | బీహార్​లో మోగిన నగారా.. రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు

Bihar Assembly Elections | బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. నవంబర్​ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా.. 14న కౌంటింగ్​ నిర్వహించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Assembly Elections | బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.

అలాగే , మన రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, 14వ తేదీన ఫలితం వెల్లడించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Elections) సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. రెండు విడుతల్లో నిర్వహించనున్న ఎన్నికల్లో మొత్తం 7.40 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ముద్రించనున్నట్లు వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోనే 17 సంస్కరణలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

Bihar Assembly Elections | రెండు విడుతల్లో ఎన్నికలు..

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సోమవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. బీహార్ లో మొత్తం 7.40 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 14 లక్షల మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారని చెప్పారు. బీహార్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

Bihar Assembly Elections | 90 వేల పోలింగ్ కేంద్రాలు..

బీహార్ లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ వెల్లడించారు. వీరంతా ఓటు వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మించకుండా చూస్తున్నామన్నారు. 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి కేంద్రంలోనూ వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని, నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సారి ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం చేస్తున్నామని వెల్లడించారు.

Bihar Assembly Elections | అక్టోబర్‌ 10న నోటిఫికేషన్..

బీహార్ మొదటి విడుత ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తెలిపారు. నామినేషన్ల దాఖలకు అక్టోబర్ 17 చివరి తేదీ అని చెప్పారు. 18న నామినేషన్ల పరిశీలన, 20 వరకు ఉపసంహరణకు అవకాశముంటుందన్నారు. నవంబర్ 6 తేదీన మొదటి విడత ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఇక, రెండో విడుత ఎన్నికలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అక్టోబర్‌ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, 23 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. రెండో విడుత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుందని చెప్పారు. నవంబర్ 14న కౌంటింగ్‌ చేపడతామని, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు. మొత్తంగా అసెంబ్లీ గడువు ముగిసే నవంబర్‌ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

Bihar Assembly Elections | 8 చోట్ల ఉప ఎన్నికలు..

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ స్థానంతో పాటు 8 నియోజకవర్గాల్లో 11న ఉప ఎన్నిక నిర్వహించి, 14న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది.