అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mallepula Narendra | విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్రను ఈ సమాజం ఎప్పటికి మరువదని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Chairman Taher Bin Handan) అన్నారు. జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ (Mallepula Narendra Memorial Sports Committee) ఆధ్వర్యంలో ఆయన 35వ వర్ధంతి సందర్భంగా ఆదివారం పాలిటెక్నిక్ మైదానంలో క్రీడలను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
Mallepula Narendra | క్రీడల నిర్వహణ అభినందనీయం
తాహెర్ మాట్లాడుతూ ఈనాడు గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ తన విధి నిర్వహణలో అమరుడైన నరేంద్ర జ్ఞాపకార్థం 35ఏళ్లుగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా స్మారక పోటీలు ఎవరూ నిర్వహించలేరని, ఇది నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ నిర్వాహకులకు స్థానిక జర్నలిస్టులకు (local journalists) సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను, జర్నలిస్టులను తాహెర్ అభినందించారు. నిజామాబాద్ మహిళ ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర స్మారకార్ధం 35ఏళ్లుగా క్రీడల నిర్వహణ అభినందీయమన్నారు. ఎవరైన మృతి చెందితే ఒకటి లేదా రెండేళ్ల పాటు వారిని గుర్తుంచుకుని ఎదైనా కార్యక్రమాలు చేస్తారన్నారు. కానీ జర్నలిస్టు నరేంద్ర మృతి చెంది 35ఏళ్లు అవుతున్నా ఇటువంటి కార్యక్రమాలు చేయటం హర్షించదగ విషయమన్నారు.
Mallepula Narendra | నిరంతరాయంగా క్రీడా పోటీలు..
నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ డి సాయిలు మాట్లాడుతూ నరేంద్ర మృతి చెంది 35ఏళ్లు గడుస్తున్నా నిరంతరాయంగా జర్నలిస్టుల మద్దతుతో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జర్నలిస్ట్‌లకు క్రికెట్, షటిల్, క్యారం పోటీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖోఖో పోటీలు రెండురోజుల పాటు నిర్వహించామన్నారు. నరేంద్ర 1989లో ఈనాడు గ్రామీణ విలేకరిగా చేరి 1991 జనవరి 29న విధి నిర్వహణలో ఆకస్మిక మరణం పొందారు. అప్పటినుంచి ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల సహకారంతో పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ క్రీడా పోటీలు జర్నలిస్టులకు ఎంతో స్పూర్తినిస్తున్నాయని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నరేంద్ర యాదిలో 35ఏళ్లుగా క్రీడాపోటీలు నిర్వహించటం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ క్రీడాపోటీలు తమ జర్నలిస్టులలో ఐక్యతను నిరూపిస్తోందన్నారు. నరేంద్రను యాది చేస్తూ రానున్న రోజుల్లో స్కూల్ పిల్లలకు సైతం పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొచ్చ రాజు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, ఎటాక్స్ కమిటీ ఛైర్మన్ బొబ్బిలి నర్సయ్య, మీసాల సుధాకర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, పొటోగ్రాఫర్లలు, కెమోరామెన్లు పాల్గొన్నారు.
Mallepula Narendra | సుభాష్ జట్టు గెలుపు
జర్నలిస్టు నరేంద్ర స్మారక పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన క్రికెట్ పోటీల్లో పంచరెడ్డి శ్రీకాంత్ ఎలెవన్ జట్టుపై సుభాష్ ఎలెవన్ జట్టు మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సుభాష్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఇందులో శ్యాం 41 పరుగులు, రవికాంత్ 34 పరుగులు చేశారు. ఇక 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంచరెడ్డి శ్రీకాంత్ జట్టు 16 ఓవర్లతో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేసి మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.