అక్షరటుడే, హైదరాబాద్: Santa Claus | క్రిస్మస్ పండుగ (Christmas festival) వేళ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే పేరు ‘శాంటా క్లాజ్’. మంచు కొండల నుంచి బహుమతుల మూటతో వస్తాడని భావించే ఈ ‘క్రిస్మస్ తాత’ (Christmas grandfather) వెనుక ఉన్న అసలైన చరిత్ర, ఆయన గొప్పతనం గురించి తెలుసుకుందాం.
క్రిస్మస్ తాత శాంటా క్లాజ్ అసలు కథ: ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాల్లో (Christmas celebrations) మునిగిపోతుంది. ఈ వేడుకల్లో శాంటా క్లాజ్ ఇచ్చే బహుమతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజానికి శాంటా క్లాజ్ ఎవరో కాదు. నాలుగో శతాబ్దానికి చెందిన ‘నికోలస్’ అనే ఒక క్రైస్తవ మత గురువు (బిషప్). ప్రస్తుతం టర్కీలో ఉన్న మైరా ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన నికోలస్, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారారు. కానీ, ఆయనలో ఉన్న సేవా గుణం ఆయన్ని లోకానికి ఆదర్శంగా నిలిపింది.
బహుమతులు: నికోలస్ పేదవారికి సహాయం చేయడాన్ని ఒక యజ్ఞంలా భావించేవారు. దీని గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఒక పేదవాడు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేక కటిక దారిద్య్రంలో ఉండగా, నికోలస్ వారికి రహస్యంగా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు గిఫ్టులను సాక్సుల్లో పెట్టి ఇవ్వడం అలవాటు. అలా ఒక రాత్రి ఆ పేదవాడి కిటికీలోంచి బంగారు నాణాలు ఉన్న సాక్సులను లోపలికి విసిరారు. అలా మూడు సార్లు సాయం చేయడంతో ఆ ముగ్గురు అమ్మాయిల వివాహం వైభవంగా జరిగింది. ఈ రహస్య దాత ఎవరో కాదని, నికోలస్ అని ఆ తర్వాత అందరికీ తెలిసిపోయింది.
Santa Claus | నికోలస్ శాంటా క్లాజ్‌గా ఎలా మారారు?
నికోలస్ చేస్తున్న ఈ రహస్య సహాయాల వార్త మెల్లగా ఊరంతా పాకి, ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి తెలిసింది. అమెరికన్ డచ్ భాషలో ఆయనను సింట్ నికోలస్ (Sint Nikolas) అని పిలిచేవారు. అదే పేరు కాలక్రమేణా శాంటా క్లాజ్ గా మారిపోయింది. ఈయన్నే ‘ఫాదర్ క్రిస్మస్’ అని, ‘ఓల్డ్ మ్యాన్ క్రిస్మస్’ అని కూడా పిలుస్తుంటారు.
బొద్దుగా తెల్లటి గడ్డంతో ఎర్రటి దుస్తుల్లో శాంటా క్లాజ్ అనగానే మనకు ఎరుపు, తెలుపు రంగు దుస్తుల్లో, తెల్లటి గడ్డంతో నవ్వుతూ కనిపించే బొద్దు వ్యక్తి గుర్తుకొస్తారు. 1823లో క్లేమెంట్ క్లార్క్ మోర్ రాసిన ‘ఏ విజిట్ ఫ్రొం సెయింట్ నికోలస్’ అనే కవిత్వం ద్వారా శాంటా క్లాజ్ రూపం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాంటా క్లాజ్ ప్రేమకు, దాన గుణానికి ప్రతీకగా నిలిచి, క్రిస్మస్ రోజున ప్రతి ఇంటికి ఆనందాన్ని పంచుతున్నారు.