అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలందరకీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.
శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ప్రకటన చేశారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు.
Indiramma Houses | కమీషన్ల కోసమే..
బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు (BRS Leaders) మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారన్నారు. కానీ తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు. గత పాలకులు కమీషన్ల కోసం ఇళ్లను పంపిణీ చేశారన్నారు. తాము గిరిజన ప్రాంతాల్లో 12,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. చెంచులకు మొదటి విడతలో ఇళ్లు కేటాయించామని వెల్లడించారు.
Indiramma Houses | డబుల్ ఇళ్లపై త్వరలో నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి 36 వేల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటికి ఇప్పటి వరకు రూ.744 కోట్లు కేటాయించామని వెల్లడించారు. వివిధ దశల్లో ఆగిపోయిన 12 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల (Double Bedroom Houses)ను పూర్తి చేస్తామన్నారు. వీటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం నుంచి నిధులను అనుసంధానం చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామన్నారు.