అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Grama Panchayats | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు సంతకం చేసిన చెక్కులకు మాత్రమే చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) హయాంలో జాయింట్ చెక్ పవర్ విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ ఉంటే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని 2018 పంచాయతీ రాజ్ చట్టంలో ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పించారు. అయితే ఇటీవల ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ (Cheque power) రద్దు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ప్రభుత్వం ఖండించింది.
Grama Panchayats | కీలక ఆదేశాలు
ప్రభుత్వం పంచాయతీ బిల్లుల చెల్లింపు విషయంలో సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు ఉంటేనే బిల్లులు మంజూరు చేయాలని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ (Panchayati Raj), గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. జీపీలకు సంబంధించిన బిల్లుల విషయంలో ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. దీంతో గ్రామాల్లో చేపట్టిన బిల్లుల చెల్లింపు కోసం సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు తప్పనిసరి కానున్నాయి.
Grama Panchayats | చెక్ పవర్ ఉండటంతో..
రాష్ట్రంలో ఇటీవల మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) ముగిశాయి. పలువురు సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం భారీగా ఖర్చు పెట్టారు. అయితే రిజర్వేషన్ అనుకూలంగా లేని గ్రామాల్లో కొందరు ఉప సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ పదవికి భారీగా పోటీ నెలకొంది. ఈ క్రమంలో కొందరు వార్డు మెంబర్లకు డబ్బులు చెల్లించి పదవులు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.