అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు.
నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల భారీ వర్షాలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో బుధవారం ఉదయం పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath)తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట్ డివిజన్లోని ఓయు కాలనీని సందర్శించారు.
Jubilee Hills | కాంగ్రెస్‌దే విజయం
మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో జరిగిందే.. జూబ్లీహిల్స్‌లో జరుగుతుందన్నారు. కాగా కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్(Jubilee Hills)లో సైతం తామే విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుస్తామనే భ్రమల్లో ఉందని ఎద్దేవా చేశారు.
నగరంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు పొన్నం తెలిపారు. అయితే పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్(BC Reservation) అంశంపై కోర్టు పరిధిలో ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.
Jubilee Hills | మంత్రుల ఫోకస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులను ప్రారంభించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy) నియోజకవర్గంలో నిత్యం తిరుగుతున్నారు. తాజాగా వరద ముంపు ప్రాంతాలను వారు సందర్శించారు. పెండింగ్ పనులు, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు తెలిపారు. వరద ముంపుపై స్థానికులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని మంత్రులు అధికారులకు సూచించారు.