అక్షరటుడే, కామారెడ్డి: Police Martyrs Day | పోలీసు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తి అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో (Kamareddy police office) అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, భద్రత, శాంతి స్థాపన కోసం అంకితభావంతో సేవలందించే వ్యవస్థ పోలీస్ శాఖ అని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఏడుగురు పోలీసు సిబ్బంది అమరులయ్యారని వారికి గౌరవప్రదంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి సంక్షేమానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Police Martyrs Day | అమరుల త్యాగం చిరస్మరణీయం: ఎస్పీ
సమాజంలో శాంతి భద్రతల స్థాపన కోసం అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవని ఎస్పీ రాజేష్ చంద్ర (Kamareddy Sp Rajesh Chandra) అన్నారు. వారు చూపిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ కర్తవ్య నిష్ఠతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఆర్మీ జవానులు, పోలీసులు విధి నిర్వాహణలో ఎల్లప్పుడూ దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడక్‌లోని అక్సాయ్ చిన్ వద్ద చైనా (China) దళాల దాడిలో 10మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏడాది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని చెప్పారు.
Police Martyrs Day | దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా అసాంఘిక శక్తులతో పోరాటంలో 191 మంది పోలీసు సిబ్బంది వీరమరణం పొందారని ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ కమాండెంట్ బానోత్ జవహర్‌లాల్, కానిస్టేబుళ్లు సందీప్, వడ్ల శ్రీధర్, యం.పవన్ కళ్యాణ్, బి. సైదులు అమరులయ్యారని ఎస్పీ వివరించారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను నెరవేర్చడం.. వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయడం.. ఆర్థికపరమైన ప్రయోజనాలు సమయానికి అందేలా చూడడం.. మానసిక బలాన్ని అందించడం ఇవే పోలీస్ అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
పోలీస్ అమరవీరుల స్మరణార్థం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు రక్తదాన శిబిరాలు (Blood donation camps), ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, వ్యాసరచన, ఫోటో, వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐలు నరహరి, రామన్, సంతోష్ కుమార్, ఆర్ఐలు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, ఎస్సైలు, సిబ్బందితో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.