అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rythu Bharosa funds | రైతు భరోసా (Rythu Bharosa)పై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల (Municipal elections) ప్రక్రియ పూర్తవగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. మిర్యాలగూడ (Miryalaguda)లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న కౌంటింగ్ ఉంటుంది. అనంతరం రైతు భరోసా విడుదల చేస్తామని సీఎం తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం అనేక నిధులు ఖర్చు చేశామన్నారు. 25.30 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.
Rythu Bharosa funds | రూ.9 వేల కోట్లు
యాసంగి సీజన్ (Yasangi Season) సగం గడిచినా ప్రభుత్వం ఇంకా రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. దీంతో రైతులు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. గత వానాకాలం సీజన్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా విడుదల చేశారు. ప్రస్తుతం కూడా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే జమ చేస్తామని సీఎం తెలిపారు. దీని కోసం రూ.9 వేల కోట్లు విడుదల చేస్తామన్నారు. అయితే సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గతంలో తెలిపారు. ఈ మేరకు సర్వే కూడా చేశారు. ఈ సర్వే నివేదిక త్వరలో ప్రభుత్వానికి చేరనుంది. వానాకాలంతో పోలిస్తే యాసంగిలో సాగు విస్తిర్ణం తగ్గుతుంది. సాగు చేసిన భూములకు వేస్తే రూ.9 వేల కోట్లు అవసరం లేదు. అయితే సీఎం మాత్రం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
Rythu Bharosa funds | కాంగ్రెస్‌దే గెలుపు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ సభనే ఇందుకు సాక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి ఓటు ముఖ్యమేనని, పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని స్వీప్ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలతో బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేయాలని పేర్కొన్నారు.