అక్షరటుడే, వెబ్‌డెస్క్: సింగపూర్‌లోని టాంజాంగ్ కటాంగ్ రహదారి(Tanjung Katong Road)పై షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టాంజాంగ్ కాటాంగ్ రోడ్డు(Tanjung Katong Road)పై జులై 26న జరిగిన ఈ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. వన్ అంబర్ కాండో సమీపంలో రోడ్డు కుప్పకూలిపోయింది. అదే సమయంలో దాని మీదుగా వెళ్తున్న ఒక కారు సింక్‌హోల్‌లో పడిపోయింది.
దీంతో కారు నడుపుతున్న మహిళకు స్వల్పగాయాలు అయ్యాయి. కాగా, అక్కడే ఉన్న కార్మికులు ఆమెను వెంటనే రక్షించారు. చికిత్స నిమిత్తం రాఫెల్స్ ఆసుప్రతికి తరలించారు. ఈ విషయాన్ని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (Singapore Civil Defence Force – SCDF) తెలిపింది.
అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత మార్గాలను మూసివేశారు. జాతీయ నీటి సంస్థ PUB తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ ఘటనపై పోస్టు చేసింది. టాంజాంగ్ కాటాంగ్ రోడ్, మౌంట్‌బాటన్ రోడ్ కూడలిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వివరించింది. సింక్‌హోల్ PUB పనులు జరుగుతున్న చోటుకు అతి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది.
Singapore : తక్షణ చర్యలు..
రోడ్డు అకస్మాత్తుగా కుప్పకూలడంతో రెండు లైన్లు కూడా ప్రభావితమయ్యాయని పీయూబీ పేర్కొంది. ఒక కారు సింక్‌హోల్‌లోకి పడిపోయిందని వెల్లడించింది. సివిల్ డిఫెన్స్ సిబ్బంది కారులో ఉన్న మహిళను బయటకు తీశారని, ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు వివరించింది.
పోలీసులు, SCDF, ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (Land Transport Authority – LTA) కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దెబ్బతిన్న రెండు నీటి పైపులను కార్మికులు వేరు చేశారు. మరమ్మతులు మొదలెట్టారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు LTA వెల్లడించింది. రోడ్డును మరమ్మతు చేయడానికి కాంట్రాక్టర్లు ఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిపింది. పార్లమెంట్ సభ్యులు గో పే మింగ్ MP Go Pei Ming (మెరైన్ పారేడే – బ్రాడెల్ హైట్స్ GRC), ఘో షి కీ Gho Shi Kee (మౌంట్‌బాటన్ SMC) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు.
చూస్తుండగానే కుంగిపోయిన రోడ్డు.. గోతిలో పడ్డ కారు
సింగపూర్‌లోని టాంజాంగ్ కటాంగ్ రహదారిపై చోటు చేసుకున్న ఘటన
ఒక మహిళ తన కారులో వెళ్తుండగా.. ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు
హఠాత్తుగా కుంగడంతో.. కారు ముందుకు వెళ్లేందుకు దక్కని సమయం
దీంతో గోతిలో పడ్డ కారు.. 5 నిమిషాల్లోనే మహిళను… pic.twitter.com/yPz2eeM7RR
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 27, 2025
