అక్షరటుడే, ఇందూరు: Heart Disease | చలికాలం (Winter) అనారోగ్య సమస్యలకు పుట్టినిల్లు లాంటిది. వైరస్, బ్యాక్టీరియల్ జబ్బులతో పాటు గుండెజబ్బుల (heart disease) ముప్పు ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో సాధారణ రోజుల్లో ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే అధిమని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు 15-20 శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చలి కాలంలో గుండె సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ సందీప్ రావు (Dr. Sandeep Rao) ‘అక్షరటుడే’కు వివరించారు.
చలికాలంలో గుండె జబ్బుల బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో యుక్త వయసులో ఉన్న యువత ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఒక్క సారిగా మార్పులు రావడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రక్త ప్రసరణలో మార్పుల కారణంగా గుండెపోటు బారిన పడే అవకాశం ఉంది. యుక్త వయసులో ఉన్న యువకులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు గుండెపోటుకు గురికావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
Heart Disease | ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సంప్రదించండి
చలికాలంలో బీపీ, రక్తనాళంలో కొవ్వు సమస్యలు తలెత్తుతాయి. చెమటలు రావడం, అలసట లాంటి లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల్ని సంప్రదించి సలహాలు సూచనలు పాటించాలి. ఆకస్మిక గుండెపోట్లు ఒక్క శాతం మాత్రమే వస్తాయి. మిగతా సందర్భాల్లో రెండు మూడు నెలల ముందు నుంచి రకరకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అలసట, దమ్ము, చెమటలు రావడం, శరీరంలో వీక్నెస్, ఒబెసిటీ, ఒత్తిడి లక్షణాలు కనబడతాయి.
Heart Disease | వ్యాయామం అవసరం
ఒకప్పుడు ప్రజలు కష్టపడి పనిచేసేవారు. కానీ ప్రస్తుతం డెస్క్ జాబ్‌లు చేసే వారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. యోగా, వ్యాయామం, వాకింగ్ లాంటివి చేయకపోవడం ద్వారా రక్తనాళాల్లో సమస్యలు తలెత్తి గుండెపోటు (heart attack) బారినపడే అవకాశం ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్, ఆల్కాహాల్, స్మోకింగ్ లాంటివి కూడా గుండె జబ్బులకు దారితీసే ఛాన్స్ అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువ అని వైద్యుడు తెలిపారు.
Heart Disease | ఈ జాగ్రత్తలు పాటించండి..
అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సందీప్ రావు సూచించారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి సమస్యలు ఉన్నవారు చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉదయం వేళల్లో ఒక్కసారిగా చల్లని వాతావరణంలో బయటకు వెళ్లడం, తీవ్రమైన శారీరక శ్రమ చేయడం ప్రమాదకరమని చెప్పారు. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించారు. వెచ్చని దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీటిని తాగడం, ఉప్పు, కొవ్వు పదార్థాలను తగ్గించి ఆకుకూరలు, పండ్లు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. రోజూ తేలికపాటి నడక, యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం గుండెకు మేలు చేస్తుందన్నారు.