అక్షరటుడే, ఇందూరు: National Voters Day | ఉమ్మడి జిల్లాలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని (National Voters Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో అధికారులు ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞలు చేయించారు.
National Voters Day | నిజామాబాద్ కలెక్టరేట్లో..
ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్లు అంకిత్, (Additional Collector Ankit) కిరణ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
National Voters Day | ఓటుహక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది..
ముందుగా భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని వినిపించారు. అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటుహక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం (Election Commission) పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తుందని తెలిపారు. ఈసారి ‘మై ఇండియా.. మై ఓటు’ నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నచ్చిన వారికి ఓటు వేసి ఎన్నుకునే అవకాశం ఉందని గుర్తుచేశారు.
National Voters Day | ఓటుతోనే భవిత..
పలు దేశాల్లో ఓటింగ్ లేకుండా నియంతృత్వ పాలన జరుగుతోందని అందుకు భిన్నంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ భారతదేశంలో స్థానికసంస్థలు మొదలుకొని పార్లమెంట్ వరకు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. 1951లో అక్షరాస్యత తక్కువ ఉన్న సమయంలోనూ అందరిని ఓటింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు అప్పటి భారత ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నేతృత్వంలో ఎలక్షన్స్ సింబల్‌ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 18ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదయ్యేలా ఎలక్షన్ కమిషన్ యువతకు వెసులుబాటు కల్పించిందని చెప్పారు.
National Voters Day | ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి..
జాతి, కుల, మత, లింగ, వర్ణబేధాలు, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరులందరికీ రాజ్యాంగ వోటు హక్కును ప్రసాదించిందని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యత ఔన్నత్యం గురించి యువత ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లు, యువ ఓటర్లకు జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు బహూకరించారు. కొత్తఓటర్లకు ఎన్నికల గుర్తింపు కార్డు అందజేశారు. అనంతరం ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సాయా గౌడ్, కలెక్టర్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
National Voters Day | బాన్సువాడలో..

అక్షరటుడే, బాన్సువాడ: ఓటుహక్కును అత్యంత విలువైనదని, ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi) సూచించారు. పట్టణంలో ఆదివారం రెవెన్యూ, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో కీలకమైందన్నారు. ప్రజల్లో ఓటుహక్కుపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
National Voters Day | ఆలూర్‌లో..

అక్షరటుడే, ఆర్మూర్: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆవగాహన ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ రమేష్ సూచనల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ రేణుకాబాయి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు.
ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పకుండా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. తర్వాత ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్ మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా మాత్రమే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చగలరన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అజయ్,శ్రీవాణి, శ్రీజ ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.