అక్షరటుడే, వెబ్డెస్క్ : Jinnaram RI | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పలువురు లంచాలు తీసుకొని కళ్లు మూసుకుంటున్నారు. పైసలు ఇస్తే అక్రమార్కులకు సహకరిస్తున్నారు.
అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని పైసల కోసం వేధిస్తున్నారు. అలాగే మామూళ్లు తీసుకొని ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు సహకరిస్తున్నారు. ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జిన్నారం మండలంలో ఆర్ఐ జయప్రకాశ్ పని చేస్తున్నాడు. మండలంలోని గడ్డిపోతారంలో అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాల కోసం ఆయన లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Jinnaram RI | నిర్మాణాలు కూల్చడంతో..
అక్రమ నిర్మాణాల కోసం గతంలో ఆర్ఐ లంచం తీసుకున్నాడు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్యారడైజ్ సిగ్నల్ వద్ద ఆయన డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అసైన్డ్ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మంగళవారం అధికారులు కూల్చివేశారు. దీంతో డబ్బులు ఇచ్చిన వ్యక్తి తాజాగా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా జయప్రకాశ్ ఐదేళ్లుగా జిన్నారం ఆర్ఐగా పనిచేస్తున్నారు. కాగా దీనిపై తహశీల్దార్ దేవదాస్ స్పందించారు. గతంలోనూ ఆర్ఐ జయప్రకాశ్పై అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. కాగా వీడియో వైరల్ కావడంతో ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.