అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy | కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే (Munugodu MLA) కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన దూకుడు పెంచారు. తాజాగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అర్థం వచ్చేలా ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.
Rajagopal Reddy | సీఎం గుర్తుంచుకోవాలి
స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులివ్వాలని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ఇటీవల మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy) సైతం ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు చెప్పారు.
సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానిక నిధులు ఇవ్వాలని కోరారు. చాలా మంది ఎమ్మెల్యేల అభిప్రాయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాగా కొంతకాలంగా నిధులు లేక అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Rajagopal Reddy | దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం ఉదయం విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతారని వస్తున్న ప్రచారాలను ఖండించారు. తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.