అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Nizamabad Tour | నిజామాబాద్ జిల్లా తనకు ఎంతో ప్రత్యేకమైందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బర్ధిపూర్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రి కాక ముందు రైతుల సమస్యపై నిజామాబాద్ జిల్లాకు వచ్చానన్నారు. నాడు ఇక్కడి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. తనను ముఖ్యమంత్రి చేయాలని అధినాయకత్వం గుర్తించడానికి నిజామాబాద్ జిల్లానే వేదిక అయ్యిందని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనది తెలిపారు. నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, మంచిప్ప ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
CM Nizamabad Tour | చైతన్యవంతమైన జిల్లా
అంకాపూర్ చికెన్ (Ankapoor chicken), నిజామాబాద్ పసుపు ఎంతో ప్రముఖమైనవన్నారు. గతంలో క్వింటాలు పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదన్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం చైతన్యవంతమైందన్నారు. రైతాంగ పోరాటంలో ఈ జిల్లా ముందుంటుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 2023 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చామన్నారు. 2029లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, తన నాయకత్వంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
CM Nizamabad Tour | బంగారం లాంటి అవకాశం
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేస్తే వృథా అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉందని.. ఏ పని చేయాలన్నా ఇక్కడే చేసుకోవచ్చన్నారు. గల్లీలో మోరీ చేయాలంటే ఢిల్లీకి వెళ్లాలా అని ప్రశ్రించారు. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ ఛైర్మన్లు, కార్పొరేటర్లు మన వాళ్లు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఉద్ధండ నేతలు ఉన్నారని.. వారికి డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని నిధులు అడిగే చనువు ఉందన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధిలో నిజామాబాద్‌కు ప్రత్యేక స్థానం కల్పిస్తామని.. ఇక్కడి నుంచే అభివృద్ధికి నాంది పలుకుతామన్నారు.
CM Nizamabad Tour | స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేకపోయారు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) మోదీ మంత్రం చదువుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. మోదీ దగ్గర పరపతి ఉందని చెప్పుకుంటున్నారని.. ఏడేళ్లలో ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అంత పరపతి ఉంటే నిజామాబాద్‌ను ఎందుకు స్మార్ట్ సిటీ చేయలేకపోయారన్నారు. నిజామాబాద్ ఎయిర్ పోర్టు ఎందుకు మంజూరు కాలేదన్నారు. ఏం తెచ్చారని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. అర్వింద్‌కు నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి.. కానీ.. అభివృద్ధి చేయాలనే లేదని విమర్శలు చేశారు. ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు నిధులు తేలేకపోయారని.. ఓటు అడిగే మీ హక్కు లేదన్నారు.
CM Nizamabad Tour | రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాన్సువాడు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 1,045 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. నిజామాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తదితర రూ. 600 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత రెండు సంవత్సరాల్లో నిధులు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయనుందని ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్, పీసీసీ ఛీప్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌అలీ, వేణుగోపాల్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ముఖ్యనేతలు మండవ వెంకటేశ్వర్ రావు, టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] Raju | ప్రజలమధ్యే ఉండి సేవ చేస్తా: 35వ… CM Nizamabad Tour | నిజామాబాద్ జిల్లాను అభివృద్… CM Tour to Nizamabad | జిల్లాలో ఎయిర్‌పోర్టు […]
Comments are closed.