అక్షరటుడే, వెబ్డెస్క్ : Nampally fire accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లి (Nampally )లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో శనివారం మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
గోదాంలో మంటలను అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారులు శనివారం రాత్రి వరకు అదుపు చేశారు. అయితే భవనంలో పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. దాదాపు 20 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోంది. ఆదివారం ఉదయం సహాయక బృందాలు సెల్లార్ లోపలికి చేరుకున్నాయి. సెల్లార్లో రెండు మృతదేహాలు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరో నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Nampally fire accident | 200 మంది సిబ్బందితో..
నాంపల్లి ఫర్నీచర్ షాపులో 20 గంటలు అవుతున్నా ఇంకా నలుగురి ఆచూకీ లభించలేదు. వారు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు సెల్లార్లలో భారీగా ఫర్నీచర్ డంప్ ఉండటంతో 200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవన దృఢత్వంపై అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ టీం భవనాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.
కాగా నాంపల్లి అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja singh) స్పందించారు. ఆయన ఆదివారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం లేకుండా ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఫైర్ సిబ్బందికి శిక్షణ అవసరం అన్నారు. విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ఆయన కోరారు. 20 గంటలైనా ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.