అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఆర్టికల్ 370ని తొలగించే అవకాశం బీజేపీకి రావడం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో గురువారం శ్యామాప్రసాద్, దీన్‌దయాళ్, వాజ్‌పేయీ విగ్రహాలను ప్రధాని ఆవిష్కరించారు.
ప్రధాని మాట్లాడుతూ.. దేశ మహనీయులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. స్వాతంత్య్రం అనంతరం మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించారని మోదీ అన్నారు. ఆ కుటుంబానికి చెందిన విగ్రహాలను ఏర్పాటు చేశారని పరోక్షంగా నెహ్రూ, గాంధీ కుటుంబంపై విమర్శలు చేశారు. దేశంలో ఇద్దరు దేశాధినేతల వ్యవస్థను శ్యామా ప్రసాద్ తిరస్కరించారని గుర్తు చేశారు.
PM Modi | వాజ్‌పేయి జయంతి
వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని ఆయన జీవితాన్ని, ఆదర్శాలను స్మరించుకోవడానికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మక జాతీయ స్మారక చిహ్నం ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ను (Rashtriya Prerna Sthal) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సముదాయంలో వాజ్‌పేయితో పాటు బీజేపీ సిద్ధాంతకర్తలైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయుల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలు కూడా ఉన్నాయి.
తామర పువ్వు ఆకారంలో రూపొందించబడి, 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక మ్యూజియం, దేశ నిర్మాణంలో ఈ నాయకుల సహకారాన్ని సందర్శకులు తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్రీయ ప్రేరణ స్థల్‌ను 65 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 230 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేశారు.